వైసీపీలోకి కేశినేని నాని.! కండిషన్స్ అప్లయ్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు టీడీపీ ఎంపీ కేశినేని నాని. విజయవాడ ఎంపీ టిక్కెట్టుని కేశినేని నానికి కాకుండా, కేశినేని చిన్నికి ఇచ్చే దిశగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకోవడంతో, వేరే దారి లేక కేశినేని నాని వైసీపీలోకి జంప్ చేస్తున్నారు.

టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన కేశినేని నాని, తనతోపాటు తన కుమార్తె కేశినేని శ్వేతని కూడా వైసీపీలోకి తీసుకెళుతున్నారు. టీడీపీ ఎంపీ అన్నమాటేగానీ, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి పక్కలో బల్లెంలానే వ్యవహరిస్తూ వచ్చారు కేశినేని నాని.

2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి ముగ్గురంటే ముగ్గురే లోక్ సభకు ఎన్నికవగా, అందులో కేశినేని నాని ఒకరు. చాలాకాలంగా టీడీపీలో కేశినేని వ్యవహారం హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. బుద్ధా వెంకన్న తదితరులతో కేశినేని నానికి అస్సలు పొసగడంలేదు.

బెజవాడ టీడీపీలో ఈ గొడవల కారణంగానే, విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ గెలవలేకపోయిందన్నది బహిరంగ రహస్యం.

ఇక, ఇప్పుడు కేశినేని నాని వైసీపీలోకి చేరుతుండడంతో వైసీపీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి. కేశినేని నానిది రాజకీయంగా నిలకడలేని మనస్తత్వం. వైసీపీలో చేరి, విజయవాడ లోక్ సభకు ఆయన పోటీ చేయడం ఖాయమైపోయింది.

అయితే, గెలిచాక మళ్ళీ వైసీపీకి ఆయన పక్కలో బల్లెంలా తయారవుతారా.? అని వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. కేశినేని నానికి ఎంపీ టిక్కెట్‌తోపాటు ఆయన వర్గానికి చెందిన ముగ్గురు నేతలకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చేలా ఒప్పందాలు జరిగాయట వైసీపీతో. కేశినేని శ్వేత అసెంబ్లీకి పోటీ చేస్తారని తెలుస్తోంది.