తెలంగాణ ఎన్నిక ఇందుకే, చక్కగా వివరించిన కెసియార్, ఉత్తమ్

నామినేషన్ల పర్వం ముగిసే సరికి , తెలంగాణ ఎన్నికల ప్రచారం తీరు పూర్తిగా మారిపోయింది. ఎన్నికల పోటీ ఎవరి మధ్య జరుగుతున్నదో, ఎందుకు జరుగుతన్నదో అనే దానిమీద రాజకీయ పార్టీలు చాలా క్లారిటీ ఇచ్చాయి. నిజానికి ఈ స్పష్టమయిన ధోరణితో ప్రజలు ఎటువైపు ఓటేయాలో నిర్ణయించుకునేందుకు అవకాశం ఉంది.  ముఖ్యమంత్రి కెసియార్ ఈ ఎన్నికలు ప్రజలేం చేయాలో స్పష్టంగా చెప్పారు. ఆయన ఈ ఎన్నికను చంద్రబాబు వర్సెస్ టిఆర్ ఎస్ గా మార్చేశారు. ఆయన దృష్టిలో చంద్రబాబే ప్రధాన శత్రువు. చంద్రబాబు ప్రమేయతో తెరాస ఓడిపోయే ప్రమాదం కూడా ఉందని అది తెలంగాణకు చాలా నష్టమని  ఆయన అంటున్నారు.

ఓడిపోతే ఎమవుతుంది?  దానికి ఆయనే చక్కటి సమాధానం చెప్పారు. ‘ ఈ ఎన్నికల్లో టిఆర్ ఎస్ ఓడిపోయిందనుకో… నాకొచ్చే నష్టం పెద్దగా ఏమీ లేదు. గెలిపిస్తే గట్టిగా పనిచేస్తా. లేకుంటే  ఫామ్ హౌస్ లో పండుకుని రెస్టు తీసుకుంటా. వ్యవసాయం చేసుకుంటా. కాని నష్టపోయేదెవరు? తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రం.  ఓటుతో కొడితే చంద్రబాబు దయ్యం వదలాలి. ఆంధ్రా పాలకులు మన పార్టీలను బతకనివ్వడం లేదు,’ ఇదీ వరస. చంద్రబాబు పేరులేకుండా కెసియార్ గాని, ఆయన కుమారుడు గాని,అల్లుడు గాని ప్రచారం చేయలేని పరిస్థితి కనిపిస్తున్నది.  ఈ ఎన్నికలను ఆయన చంద్రబాబు వర్సెస్ కెసియార్ గా మార్చేశారు.

ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాగే స్పష్టత ఇచ్చింది. టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్ది సేపటి కిందట విలేకరులతో మాట్లాడుతూ ఈ   ఈ  ఎన్నికలు ఎవరి మధ్య జరగుతున్నాయో స్పష్టత ఇచ్చారు.  ఆయన తెలంగాణ ఎన్నికలు  ‘ కెసియార్ కుటుంబానికి తెలంగాణ ప్రజలకు మధ్య నడుస్తున్నాయి,’ అని క్లప్తీకరించారు.

‘తెలంగాణ ప్రభుత్వంలో  టిఆర్ఎస్ లో కేసీఆర్ కుటింబీకులు తప్ప మరెవరూ ఉండరు. కేసీఆర్ నియంతృత్వ పాలనతో ప్రజలు , నాయకులు విసిగిపోయారు. కేసీఆర్ పాలన నుండి విముక్తి కలిగే రోజులు దగ్గరపడ్డాయి. కేసీఆర్, కేటీఆర్ లపై ప్రజల్లో ఉన్న ముసుగు తొలగిపోయింది.కేసీఆర్, కేటీఆర్ లు కేవలం తెలంగాణ ను దోచుకోవడానికి అధికారాన్ని కోరుకుంటున్నారని ప్రజలకు అర్ధమయ్యింది.

తెలంగాణ కు కేసీఆర్ కుటుంబం నుండి విముక్తి జరగపోతుంది. కేసీఆర్ . తెలంగాణ.సెంటిమెంట్ ముసుగు వేసుకున్నారు ..ఆ ముసుగు తొలిగిపోయింది. కేసీఆర్ ఇచ్చిన ఏఒక్క మాట నిల్సబెట్టుకోలే. *కేసీఆర్ ను రాజకీయంగా బొందపెడతారు. కేసీఆర్ పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం,’ ఇదీ ఉత్తమ్ వరస.

ఇపుడు నిర్ణయించుకోవాలి.  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి   చంద్రబాబును తరిమేసేందుకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయన్న కెసియార్ వాదను ఏకీభవించి టిఆర్ ఎస్ ను గెలిపిస్తారా లేక ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు కెసియార్ కుటుంబం దోపిడి చేస్తున్నది నిజమేనని నమ్మి  ఈ కుటుంబం నుంచి తెలంగాణను కాపాాడేందుకు మహాకూటమికి ఓటేస్తారా?

ప్రజలు ఎవరి మాట వింటారో చూడాలి.