రాహుల్‌, సోనియాపై ఈడీ కేసు: ‘ఖర్మ’ ఫలితమేనా.?

Karma

కర్మ సిద్ధాంతం సంగతేమోగానీ, ఇదేం ‘ఖర్మ’ అని కాంగ్రెస్ పార్టీ జుట్టు పీక్కునే పరిస్థితి అయితే వచ్చింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, అలాగే ప్రియాంక గాందీ కూడా నేషనల్ హెరాల్డ్ కేసులో అడ్డంగా బుక్కయ్యారన్న ప్రచారం జరుగుతోంది.

రాహుల్ గాంధీ మూడు రోజులుగా ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. నిజానికి, చట్టం ముందు ఎవరైనా సమానమే. కానీ, చిత్రంగా ఇది రాజకీయ చట్టం. అదే అసలు సమస్య. బీజేపీ నేత సుజనా చౌదరి మీద చాలా ఆరోపణలున్నాయి. టీడీపీ నుంచి ఆయన ఎప్పుడైతే బీజేపీలో చేరారో, అంతే.. ఆయన వైపుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆ తర్వాత గట్టిగా చూసింది లేదు.

సుజనా చౌదరి వ్యవహారం జస్ట్ ఒక్క ఉదాహరణ మాత్రమే. రాజకీయ నాయకులు, తమ మీద వున్న కేసుల నుంచి తప్పించుకోవడానికి, అధికారంలో వున్న పార్టీల పంచన చేరడం.. అనేది కొత్త విషయం కాదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డినే తీసుకుంటే, ఆయన మీద అక్రమాస్తుల కేసు, కాంగ్రెస్ హయాంలో బనాయించబడింది. దానికి ఫలితమే, ఇప్పుడు గాంధీ కుటుంబం అడ్డంగా ఈడీ ముందు ఇరుక్కుపోవడమని వైసీపీ పండగ చేసుకుంటోంది.

కర్మ సిద్ధాంతాన్ని చూసుకుంటే, ఇప్పుడు నవ్వితే రేపు ఏడవాలి.. ఇప్పుడు ఏడిస్తే, రేపు నవ్వుకునేందుకు అవకాశం వుండొచ్చు. ఇదొక సైకిల్. ఇప్పుడు నవ్వుతున్నోళ్ళంతా రేప్పొద్దున్న మళ్ళీ ఏడవాల్సి రావొచ్చు.

దేశంలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం సమీప భవిష్యత్తులో కనిపించడంలేదు. వస్తే మాత్రం, ఈడీ సహా సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థలన్నీ కాంగ్రెస్ ప్రత్యర్థుల మీద దాడి చేస్తాయ్. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవ్. ఇది రాజకీయ కర్మ సిద్ధాంతం.! ఇది ప్రజాస్వామ్యానికి పట్టిన ఖర్మ.!