కాపు ముఖ్యమంత్రి.! ఎవరికి ఎవరు నష్టం చేస్తున్నారు.?

కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే తప్పేంటి.? అంటూ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ‘కాపు ముఖ్యమంత్రి’ అన్న విషయమై పెద్దయెత్తున రచ్చ జరుగుతోంది. ఇటీవల కాపునాడు జరిగింది. వైసీపీ కాపు నేతలూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.. టీడీపీలోని కాపు నేతలు కూడా మల్లగుల్లాలు పడుతున్నారు.

‘మా సామాజిక వర్గానికి వేరే శతృవులు అవసరం లేదు. మాకు మేమే శతృవులం. మమ్మల్ని ఎదగనీయకుండా మేమే చేసుకుంటాం..’ అంటూ ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ కాపు నేత ఒకరు మొన్నామధ్యన తీవ్రస్థాయిలో అసహనానికి గురయ్యారు.. అది ఓ న్యూస్ ఛానల్ చర్చా కార్యక్రమం సందర్భంగా.

చంద్రబాబునాయుడు కేవలం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే ముఖ్యమంత్రి అయ్యారా.? ఎన్టీయార్ విషయంలో ఇలా అనగలమా.? వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈ ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టే ముఖ్యమంత్రులయ్యారా.? ప్రజలు ఓట్లెయ్యాలి.. ఆయా వ్యక్తుల్లో నాయకత్వ లక్షణాల్ని ఇతర నాయకులూ గుర్తించాలి. అప్పుడే, ఏ పార్టీ అయినా బలోపేతమవుతుంది.. రాజ్యాధికారం దక్కించుకోగలుగుతుంది.

చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఆయన గనుక గట్టిగా నిలబడి వుంటే, కాపు ముఖ్యమంత్రిని రాష్ట్రం చూసి వుండేదేమో.! పవన్ కళ్యాణ్ కూడా వ్యూహాత్మక తప్పిదాలు చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేసి వుంటే, 2019 ఎన్నికల నాటికి బలోపేతమయ్యేది. నిజమే, తప్పులు కాపు సామాజిక వర్గ ప్రముఖుల నుంచే జరుగుతున్నాయ్. దీంట్లో ఇతరుల్ని నిందించాల్సిన అవసరమే లేదు.!