కమ్మ వర్సెస్ కురుబ: గోరంట్ల మాధవ్ వీడియో తెచ్చిన ‘డర్టీ’ కుల సమరం.!

Gorantla

హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్‌కి సంబంధించిన ‘వీడియో కాల్’ వివాదం కొత్త మలుపు తిరిగింది. ‘కమ్మ నాయాళ్ళు..’ అంటూ గోరంట్ల మాధవ్, మొత్తంగా కమ్మ సామాజిక వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో, ఆ సామాజిక వర్గ ప్రతినిథులు గోరంట్ల మాధవ్ తక్షణం తమ సామాజిక వర్గానికి బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి.

చిత్రంగా, ఈ వ్యవహారంలోకి గోరంట్ల మాధవ్ సామాజిక వర్గం ‘కురుబ’ ప్రతినిథులొచ్చారు. అది ఫేక్ వీడియో అనీ, నారా లోకేష్ నేతృత్వంలో ఆ వీడియో బయటకు వచ్చిందనీ, అసలంటూ ఈ గొడవలో బాధితులు లేనప్పుడు అది ఫేక్ వీడియోనే అవుతుందని కురుబ సామాజిక వర్గ ప్రతినిథులు చెబుతున్నారు.

‘కమ్మనాయాళ్ళు’ అని విమర్శించింది టీడీపీలోని కొందరినేననీ, మొత్తంగా సామాజిక వర్గానికి ఆ వ్యాఖ్యల్ని ఎలా ఆపాదిస్తారంటూ కురుబ సామాజిక వర్గ ప్రతినిథులు కొత్త లాజిక్కుని తెరపైకి తెచ్చారు. కమ్మ సామాజిక వర్గం చేస్తున్న ఆందోళనలకు పోటీగా, కురుబ సామాజిక వర్గ ప్రతినిథులూ ఆందోళనలకు దిగుతున్నారు. వెరసి, నగ్నవ వీడియో కాల్ వివాదం కాస్తా, కులాల కుంపట్లకు దారి తీసినట్లయ్యింది.

ఈ వివాదం ఇంకా ముదిరి పాకాన పడకూడదంటే, అసలు ఆ వీడియో నకిలీనా.? ఒరిజినలా.? అన్నది తేలాల్సి వుంది. ఆ బాధ్యత ప్రభుత్వమ్మీదనే వుంది. ప్రభుత్వం వీలైనంత వేగంగా, ఆ వీడియో వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చాలి. ఒకవేళ గోరంట్ల మాధవ్ తప్పు చేయలేదంటే, ఆ విషయాన్ని అయినా ప్రభుత్వం వీలైనంత వేగంగా బయటపెట్టి, ఆయనకు క్లీన్ చిట్ ఇవ్వడం మంచిది.

లేదూ, గోరంట్ల మాధవ్ తప్పు చేసినట్లు గనుక నిర్ధారణ అయితే, ఆ విషయాన్ని అయినా వీలైనంత వేగంగా బయటపెట్టడమే మంచిది. ఈ వివాదం రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చకముందే ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.. వీలైనంత వేగంగా నిజాల్ని నిగ్గు తేల్చాలి.