టీడీపీది కమ్మ పాలన.. అనే అంటారు చాలామంది. అదెంతవరకు సబబు.? అన్నది వేరే చర్చ. వైసీపీ పాలన మీద ‘రెడ్డి పాలన’ అనే ముద్ర వుంది. దాన్నీ చెరిపేయడానికి వీల్లేని పరిస్థితి. అధికారంలో వున్నవారు, తమ కులానికి మాత్రమే అనుకూలంగా వ్యవహరిస్తారా.? లేదా.? అంటే, అందులో నిజమెంతన్నదానిపై మళ్ళీ భిన్నాభిప్రాయాలుంటాయి. ‘ఎప్పుడూ, మీ ఇద్దరేనా.? మూడో శక్తికి ఖచ్చితంగా అవకాశం దక్కాలి. మూడో వర్గం అధికారంలోకి రావాలి..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యల్ని ఎలా పరిగణనలోకి తీసుకోవాలి.? ఇంకెలా, మూడో ప్రభుత్వం ఖచ్చితంగా కాపు ప్రభుత్వం అయి వుండాలన్న సంకేతాల్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పంపేశారు. వంగవీటి రంగా పేరుని పవన్ ప్రస్తావించారు. ఆ వంగవీటి రంగా వెనుక వేలల్లో అనుచరులుండేవారు. కానీ, ఆయన చనిపోయే సమయంలో.. ఆయన్ని కాపాడేందుకు ఎవరూ లేరు.
ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించడాన్ని వ్యూహాత్మక రాజకీయంగానే భావించాలి. పవన్ కళ్యాణ్ సభలకు జనం వెళ్ళడం కాదు, పవన్ కళ్యాణ్‌కి అండగా వుండడానికీ, కాపు సమాజం నుంచి, సమాజంలోని ఇతర వర్గాల నుంచీ జనం రావాలన్నదే జనసేనాని మాటల్లోని ఆంతర్యం. అయితే, ‘కాపు సామాజిక వర్గం మాత్రమే కాదు.. అధికారం పరంగా అన్ని సామాజిక వర్గాలకీ న్యాయం జరగాలి. ఉన్నత పదవులు అన్ని సామాజిక వర్గాలకీ సమానంగా దక్కాలి..’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల కాపు సమాజం ఎలా స్పందిస్తుంది.? అన్నది ప్రస్తుతానికైతే మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఎందుకంటే, ‘కాపు’ ముద్ర వున్నా, ప్రజారాజ్యం పార్టీ నిలదొక్కుకోలేకపోయింది.. జనసేన నిలబడలేకపోతోంది. ఆ సమాజంలో నెలకొన్న అంతర్గత విభేదాలనీ పవన్ పరోక్షంగా ప్రస్తావించి వదిలేసిన దరిమిలా రాష్ట్ర రాజకీయాల్లో ఇకపై కొత్త చర్చ, కొత్త రాజకీయం షురూ అయినా ఆశ్చర్యమేమీ లేదు.