పురంధేశ్వరిపై సంచలన వ్యాఖ్యలు చేసిన కంభంపాటి

కాంగ్రెస్ తో టీడీపీ కలయికపై రాజకీయవర్గాల్లో హాట్ హాట్ చర్చలు నడుస్తున్నాయి. ప్రతిపక్షాలు చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుబడుతూ పలు విమర్శలు చేస్తున్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడటానికి ఎన్టీఆర్ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీ సిద్ధాంతాలను పక్కనబెట్టి చంద్రబాబు కాంగ్రెస్ తో చేతులు కలిపి స్వార్ధ రాజకీయాలు చేస్తున్నారంటూ దుయ్యబడుతున్నారు. ఎన్టీఆర్ కు రెండవసారి వెన్నుపోటు పొడిచారంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరి కూడా దీనిపై విమర్శలు చేస్తున్నారు.

అయితే ప్రతిపక్షాలు చేస్తున్న ఈ విమర్శలపై టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ రావు ధీటుగా సమాధానం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు చేసిన పనికి ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది అంటూ విమర్శలు చేస్తున్న విపక్షాలకు చురకలంటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ, జనసేన, పురంధేశ్వరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారో కింద చదవండి.

సేవ్ నేషన్-సేవ్ డెమోక్రసీ పేరుతో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. మోదీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు పోరాటం చేస్తున్నారు. ఆయన పోరాటాన్ని వైసీపీ, జనసేన వ్యతిరేకిస్తున్నాయి. ఎన్టీఆర్ విధానాలను కొనసాగిస్తూనే చంద్రబాబు మోదీపై పోరాటం చేస్తున్నారని స్పష్టం చేశారు. పురందేశ్వరి కాంగ్రెస్ లో చేరినప్పుడు ఎన్టీఆర్ ఆత్మ క్షోభించలేదా? పురందేశ్వరి మళ్ళీ బీజేపీలో చేరినప్పుడు ఎన్టీఆర్ ఆత్మ గుర్తు రాలేదా? అని నిలదీశారు కంభంపాటి.

పవన్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు…

కాంగ్రెస్-టీడీపీ పొత్తుపై జనసేన అధినేత ట్విటర్ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు మీడియా ఎదుట కూడా ఆయన టీడీపీపై విమర్శలు గుప్పించారు. అయితే పవన్ చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు మంత్రి గంటా శ్రీనివాసరావు. శనివారం ఆర్కే బీచ్ రోడ్డులో మూడవ వైజాగ్ బే మారథాన్ ను గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు రాజకీయ అనుభవం ముందు పవన్ కళ్యాణ్ ఎంత అని ఎద్దేవా చేశారు. వాళ్లంతా చిన్నవాళ్లు. వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన పని లేదు. పార్టీల్లో మార్పులు చేర్పులు సహజం అని చెప్పారు మంత్రి గంటా.