మంత్రి కాకాణి సీరియస్… చంద్రబాబు రియాక్ట్ అవ్వాలంటున్న తమ్ముళ్లు!

అసత్య ఆరోపణలు గుప్పించడం, అవివేకంతో కూడిన ప్రకటనలు చేయడం, నిస్సిగ్గు చర్యలు చేపట్టడం, ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకుని తన బిడ్డ అని చెప్పుకోవడం… మొదలైన విషయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేతలు ఆరితేరిపోయారన్న స్థాయిలో ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ ఫైరయ్యారు.

తాజాగా మైకందుకున్న ఆయన… బిందు సేధ్యం పైనా.. టీడీపీ – వైసీపీ మ్యానిఫెస్టోలపైనా స్పందించారు. 1992లోనే మైక్రోసాఫ్ట్ లో సత్య నాదెళ్ల చేరితే.. అప్పటికి ఇంకా చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేకపోయినా… ఆ క్రెడిట్ కూడా తనఖాతాలోనే వేసుకునే నిస్సిగ్గు మనిషి చంద్రబాబు అంటూ ఆధారాలతో సహా చూపించారు కాకాణి.

ఇదే సమయంలో వైసీపీ మ్యానిఫెస్టో పై తాజాగా అచ్చెన్నాయుడి నేతృత్వంలో టీడీపీ నేతలు చేసిన విమర్శలు, విడుదల చేసిన పుస్తకాలపై కాకాణి ఫైరయ్యారు. తెలుగుదేశం పార్టీ మాదిరిగా వైసీపీ మేనిఫెస్టోను దాచలేదని.. ఇంటర్నెట్‌ నుంచి తొలగించనూ లేదని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోను చేతిలో పట్టుకుని ఇంటింటికి వెళ్లి ఏ ఏ పథకాలు వచ్చాయి అనే విషయాన్ని ఆరా తీస్తున్నాం అని కాకాణి తెలిపారు.

ఈ సందర్భంగా గత 2014 ఎన్నికల సమయంలో టీడీపీ మేనిఫెస్టోలో 650 వాగ్దానాలు ఇచ్చి 10 శాతం కూడా అమలు చేయలేని వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తిన కాకాణి… చంద్రబాబు ఏ రోజైనా మేనిఫెస్టోకు సంబంధించి మాట్లాడారా అని సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి… చంద్రబాబు, అచ్చెన్నయుడులకు ఒక బహిరంగ సవాళ్ విసిరారు. ఆ సవాళ్ కు స్పందించాలని కోరుతూ… చీమూ నెత్తురూ ఉంటేనే అనే సౌలభ్యం కల్పించారు.

“టీడీపీ నేతలు కోరుకున్న గ్రామానికి వెళదాం.. కుప్పం లేదా టెక్కలి కి వెళ్లి చూద్దాం.. టీడీపీ మేనిఫెస్టో.. వైసీపీ మేనిఫెస్టో ఏవిధంగా అమలైందో చూద్దాం.. అన్ని వర్గాల వద్దకూ వెళ్లి పరిశీలిద్దాం.. చంద్రబాబు, అచ్చెన్నాయుడులకు చీమూ నెత్తురు ఉంటే మా సవాల్‌ ను స్వీకరించాలి” అని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు.

ఈ సందర్భంగా లోకేష్ పై కూడా స్పందించిన మంత్రి… బిందు సేద్యంపై లోకేశ్ చేసిన ఆరోపణలు అన్నీ అసత్యమని చెప్పిన కాకాణి… బిందు సేద్యంకు రూ.1250 కోట్లు జగన్ సర్కార్ ఇచ్చిందని తెలిపారు. ఇదే సమయంలో చంద్రబాబు దిగిపోయే సమయానికి రూ.800 కోట్ల బకాయిలను పెడితే ఆ బకాయిలతో కలిసి రూ.2వేల కోట్లను ఇప్పటికే చెల్లించామని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో బిందు సేద్యం అమలుకు సంబంధించి రాష్ట్రానికి కేంద్రం అవార్డును ఇచ్చింది అని గుర్తు చేసిన మంత్రి… ఏపీలో నాలుగు జిల్లాలకు ఈ అవార్డులు వచ్చాయని తెలిపారు. అదే విధంగా… చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా రాష్ట్రానికి అవార్డులు వచ్చాయా అని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ప్రశ్నించారు.

అయితే ఈ స్థాయిలో ఛాలెంజ్ లు, విమర్శలు రావడంతో… ఈ ఛాలెంజ్ లకు చంద్రబాబు అంగీకరించాలని.. ఫలితంగా కుప్పం – టెక్కిలిలో పర్యటించి మేనిఫెస్టోల అమలులో టీడీపీ కున్న నిజాయితీని క్రమశిక్షణను కమిట్ మెంట్ ని మరో సారి నిరూపించి వైసీపీకి షాకివ్వాలని కోరుతున్నారు టీడీపీ కార్యకర్తలు. మరి కార్యకర్తల అభిప్రాయానికి చంద్రబాబు విలువిస్తూ స్పందించి మేనిఫెస్టోపై చర్చకు సిద్ధపడతారా.. లేక, కాకాణి ఇచ్చిన సౌలభ్యాన్ని వాడుకుంటారా అన్నది వేచి చూడాలి!