జూనియర్ ఎన్టీయార్ పొలిటికల్ మంతనాలు.!

సినిమాల్నీ, రాజకీయాల్నీ విడదీసి చూడలేని పరిస్థితి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వున్నారు. జనసేన పార్టీకి ఆయన అధినేత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామనే ధీమా ఆయనలో వుంది. ఇంకోపక్క, తెలుగుదేశం పార్టీలో వున్నారు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ. హిందూపురం ఎమ్మెల్యే ఆయన.

సినీ నటి రోజా, సినిమాలకు దాదాపు గుడ్ బై చెప్పేసి, రాజకీయాల్లో సెటిలైపోయారు. చాలామంది నటులు, నిర్మాతలు రాజకీయాల్లోనే వున్నారు. మరి, యంగ్ టైగర్ ఎన్టీయార్ సంగతేంటి.? తెలుగుదేశం పార్టీని ఆయన టేకోవర్ చేస్తాడా.? లేదా.? గత కొద్ది రోజులుగా, జూనియర్ ఎన్టీయార్ రాజకీయ మంతనాలు జరుపుతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. 2024 ఎన్నికలకు సంబంధించి జూనియర్ ఎన్టీయార్, తన సహచరులతో రాజకీయ అంశాలపై చర్చలు జరుపుతున్నాడట. జూనియర్ ఎన్టీయార్‌ని పలువురు రాజకీయ ప్రముఖులూ కలుస్తున్నారట కూడా.

మొన్నామధ్య బీజేపీ జాతీయ నాయకులు, హైద్రాబాద్‌లో జూనియర్ ఎన్టీయార్‌ని కలిసిన విషయం విదితమే. బీజేపీ జాతీయ నాయకులు కలిసిన సినీ ప్రముఖుల్లో హీరో నితిన్ కూడా వున్నాడు. నితిన్ వ్యవహారం వేరు. జూనియర్ ఎన్టీయార్ పరిస్థితి వేరు. గతంలో టీడీపీ తరఫున జూనియర్ ఎన్టీయార్ ప్రచారం చేశాడు.

కాగా, జనసేనకు జూనియర్ ఎన్టీయార్ మద్దతివ్వాలంటూ, ఆయనకు కొందరు సన్నిహితులు సూచిస్తున్నారట. అలా ఎలా కుదురుతుంది.? తాతగారి పార్టీ టీడీపీ తరఫునే ప్రచారం చేయాలని ఇంకొందరు అంటున్నారట. ‘ఈ రాజకీయాలు మనకొద్దు..’ అనకుండా, అన్ని విషయాల్నీ జూనియర్ ఎన్టీయార్ పరిగణనలోకి తీసుకుంటున్నాడట.