వైఎస్ జగన్‌తో భేటీకి జూనియర్ ఎన్టీయార్ ససేమిరా.?

‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది భావ్యం కాదు. నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నేను రాజకీయాలకు దూరం. నన్ను రాజకీయాల్లోకి లాగకండి..’ అంటూ సినీ నటుడు జూనియర్ ఎన్టీయార్, ఇటీవల తనను కలిసిన కొందరు వైసీపీ నేతలతో తేల్చి చెప్పారట.

నిజమేనా.? నిప్పు లేకుండా పొగ రాదన్నది పాత మాటే.. ఇప్పుడైతే, నిప్పు లేకుండా కూడా పొగ వచ్చేస్తుంటుంది. టీడీపీ శ్రేణులు, జూనియర్ ఎన్టీయార్‌ని టార్గెట్ చేస్తున్న దరిమిలా, అతని మీద సింపతీ కురిపిస్తోంది వైసీపీ. జూనియర్ ఎన్టీయార్‌కి వైసీపీ నేత కొడాలి నాని అత్యంత సన్నిహితుడు. టీడీపీ నుంచి వైసీపీలోకి దూకేసిన వల్లభనేని వంశీ కూడా జూనియర్ ఎన్టీయార్‌కి అత్యంత ఆప్తుడే.

కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇప్పటికీ జూనియర్ ఎన్టీయార్‌తో టచ్‌లో వున్నారని టీడీపీ నమ్ముతోంది. ఆ కారణంగానే జూనియర్ ఎన్టీయార్ మీద టీడీపీ శ్రేణులు బురద చల్లుతుంటాయి సోషల్ మీడియా వేదికగా.

ఇటీవలి పరిణామాల నేపథ్యంలో టీడీపీ అంటేనే అసహ్యం పుట్టేసింది జూనియర్ ఎన్టీయార్‌కి. దీన్ని క్యాష్ చేసుకునేందుకు వైసీపీ నేతలు కొందరు ప్రయత్నిస్తున్నారట. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవాల్సిందిగా వారు ఎన్టీయార్‌కి సూచిస్తున్నారట.

ఈ నేపథ్యంలోనే, వారి ఆహ్వానాన్ని జూనియర్ ఎన్టీయార్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.