ఆ లేఖ చదివితే పవన్ ఏపీ వదిలి పారిపోవడం ఖాయం!

వారాహి యాత్రలో భాగంగా వరుస బహిరంగ సభలు పెడుతూ వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. అయితే ఈ సమయంలో… శృతిమించుతున్న పవన్ వ్యవహారం వల్ల “కొండనాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిపోయింది” అన్నట్లుగా ఉందని కామెంట్ చేస్తున్నారు విశ్లేషకులు. సరిగ్గా ఈ సమయంలో మైకుల ముందుకు వచ్చారు మంత్రి జోగి రమేష్.

పవన్ బలమే కాపుసామాజికవర్గంలోని యువత అని అంటుంటారు పరిశీలకులు. వాటిని బలపరిచే సంఘటనలు గతంలో ఎన్నో తెరపైకి వచ్చాయి. ఈ సమయంలో తన బలం గోదావరి జిల్లాలే అని చెప్పుకుంటున్న పవన్.. అక్కడున్న కాపు బలగాన్ని ఒకతాటిపైకి తీసుకొచ్చే పనికి పూనుకోవాలి. ఫలితంగా రాజకీయంగా ఎదగాలి. కానీ… ఉన్న ఆ నాలుగు ఓట్లలో కూడా పరిపూర్ణంగా చీలిక తీసుకొచ్చాడు పవన్ కల్యాణ్. ఫలితంగా… తనకు కాస్తో కూస్తో అనుకూలంగా ఉన్న ఓటుబ్యాంకును కాలదన్నుకున్నంత పనిచేశారు.

సరిగ్గా ఈ సమయంలో ముద్రగడ ఒక లేఖ రాశారు. ఆ లేఖలో పవన్ ను తిట్టారనుకుంటే తిట్టారు.. ఫుల్ గా వాయించారనుకుంటే వాయించారు.. సున్నితంగా సూచించారనుకుంటే సూచించారు.. అన్నట్లుగా ఉన్నా.. సరిగ్గా గమనిస్తే ఎడాపెడా వాయించేసినట్లే కనిపిస్తుంది. గోదావరి జిల్లాల వెటకారాన్ని పరిపూర్ణంగా చూపెడుతూ… పవన్ కు సాఫ్ట్ గా కత్తి దింపేసినంత పనిచేశారు.

తాజాగా ఈ లేఖపై జోగి రమేష్ స్పందించారు. పవన్ కల్యాణ్ ఆ లేఖ చదివితే ఏపీ వదిలిపెట్టి పారిపోవడం ఖాయమని కామెంట్ చేశారు. నేనెక్కడికీ వెళ్లను, గోదావరి లాగే ఈ జిల్లాలను అంటిపెట్టుకుని ఉంటానంటూ.. ఇటీవల పదే పదే పవన్ కల్యాణ్ చెబుతున్న నేపథ్యంలో… ముద్రగడ లేఖను సరిగ్గా చదివితే ఏపీ వదిలి పారిపోతారని అంటున్నారు మంత్రి జోగి రమేష్. ఇక, గతంలో సీఎం సీఎం అంటూ ఆయన అభిమానులు గోల చేసేవారని, ఇప్పుడు పవన్ మాత్రం.. తనను ఎమ్మెల్యేగా గెలిపించండి చాలు అంటూ బతిమిలాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

ఈ సందర్భంగా డోసు పెంచిన జోగి రమేష్… వంగవీటి మోహన్ రంగాని హత్యచేయించిన చంద్రబాబు కోసం, ముద్రగడ కుటుంబ సభ్యులను కొట్టుకుంటూ లాక్కెళ్లిన చంద్రబాబు కోసం పవన్ పనిచేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. అనంతరం.. కాపులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంది స్వర్గీయ వైఎస్సార్, జగన్ మాత్రమేనని జోగి స్పష్టం చేశారు.