ఇంకెన్ని పార్టీలు మారుతారు ?

సెలబ్రిటీ జంట జీవితా రాజశేఖర్ గురించి కొత్తగా ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. సినామాల్లో బాగా బిజీగా ఉన్నప్పటికీ వీళ్ళద్దరికీ రాజకీయ వాసనలు కూడా ఎక్కువే. అందుకనే అప్పుడప్పుడు రాజకీయ పార్టీలతో కలిసి ప్రయాణం చేస్తుంటారు. అయితే సమస్య ఏమిటంటే ఏ పార్టీలోను ఎక్కువ రోజులుండరు.

ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే లోటస్ పాండ్ నివాసంలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో దంపతులిద్దరూ వైసిపిలో చేరి కండువా కప్పుకున్నారు. వైసిపిలో చేరటం వీరిద్దరికి ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా వీరు వైసిపిలో కొంతకాలం ఉన్నారు. తర్వాత జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేసి బిజెపిలో చేరారు.

అక్కడ కొంత కాలం తర్వాత బిజెపిలో కూడా ఇమడ లేకపోయారు. దాంతో ఆ పార్టీకి రాజీనామా చేసి టిడిపి తీర్ధం పుచ్చుకున్నారు. కొంతకాలం తర్వాత షరా మామూలుగానే టిడిపిలో కూడా ఇమడలేకపోయారు. దాంతో తెలుగుదేశంపార్టీకి కూడా రాజీనామా చేశారు. భూమి గుండ్రంగా ఉంటుందనే విషయం వీళ్ళద్దరి విషయంలో నిజమైనట్లు చివరకు అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ వైసిపిలోకి చేరారు.

ఇక్కడ సమస్యేమిటంటే ? ఏ పార్టీలో కూడా వీళ్ళద్దరు ఎందుకు ఇమడ లేకపోతున్నట్లు ? ఎందుకంటే, ఏ పార్టీలో చేరినా వీళ్ళకి అగ్ర తాంబూలం దక్కాలని పట్టుబడతారు. మళ్ళీ పార్టీలో ఒళ్ళొంచి  పనిచేయమంటే మాత్రం ఎక్కడా కనబడరు. వీళ్ళకు తాము చాలా పెద్ద సెలబ్రిటీలనే భ్రమల్లో ఉంటారు. అందుకే తమను అందరూ చాలా గొప్పగా చూడాలని కోరుకుంటుంటారు.

ఆమధ్య సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. దాంతో ఇటు రాజకీయాల్లో నుండే కాకుండా సినిమాల్లో కూడా పెద్దగా వెలగలేదు. అయితే ఈ మధ్య గరుడవేగ అనే సినిమా బాగా ఆడి డబ్బులు రావటంతో మళ్ళీ ఉత్సాహంగా కనబడుతున్నారు. అందుకే తాజాగా వైసిపిలో చేరారు. ఒక్క జనసేనలో తప్ప అన్నీ పార్టీలు తిరిగేసినట్లే కనబడుతోంది.