లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నాడు అన్నది జగన్ పై గడచిన పదేళ్ళుగా వినిపిస్తున్న ఆరోపణ. 2014 ఎన్నికల్లో జగన్ కు అధికారం తృటిలో తప్పి పోవటానికి అవినీతి ఆరోపణలు కూడా ఓ కారణమే. అయితే అప్పట్లో జగన్ అక్రమార్జన కేసులను విచారించిన సిబిఐ మాజీ జేడి అదంతా ఉత్త ఆరోపణలే అని తేల్చేయటం గమనార్హం. జగన్ పై వినిపించిందంతే కేవలం రాజకీయపరమైన ఆరోపణలుగా జేడి అభిప్రాయపడ్డారు.
ఒకప్పటి సిబిఐ ఉన్నతాధికారి మొన్నటి ఎన్నికల్లో జనసేన తరపున విశాఖపట్నం ఎంపిగా పోటీ చేశారు. గత వారం రోజులుగా జేడికి వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి మధ్య ట్విట్టర్ యుద్ధం భీకరంగా నడుస్తోంది. ఇటువంటి నేపధ్యంలో జేడి చేసిన వ్యాఖ్యలు జగన్ కు అనుకూలంగా ఉన్నాయి. తనపై సిబిఐ పెట్టిన కేసులు, అరెస్టు అంతా కేవలం రాజకీయంగా జరిగినవే అంటూ జగన్ పదే పదే మొత్తుకుంటున్నారు.
జగన్ ఎప్పటి నుండో చెబుతున్న దాన్నే ఇపుడు జేడి ధృవీకరించినట్లైంది. జగన్ పై ఆరోపణల విషయంలో తమకు అందిన ఆధారాల ప్రకారమే చార్జిషీటు వేసినట్లు చెప్పారు. చార్జిషీటు ప్రకారం రూ 1500 కోట్లపైనే ఆరోపణలు ఉన్నట్లు స్పష్టంగా చెప్పారు. ఒక పద్దతి ప్రకారం జగన్ పై చంద్రబాబు అండ్ కో తో పాటు చంద్రబాబు మీడియా పదే పదే లక్ష కోట్లు దోచుకున్నట్లు ఆరోపించారు.
నిజానికి జగన్ పై అక్రమాస్తుల కేసుల విచారణ కారణంగానే సిబిఐలో లక్ష్మీనారాయణ అనే జాయింట్ డైరెక్టర్ పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసింది. అప్పట్లో జగన్ పై చంద్రబాబు మీడియా వండి వార్చిన కథనాలను కూడా జేడా ఏనాడూ ఖండించలేదు. దాంతో ఆ కథనాలు వాస్తవమన్నట్లుగా జనాల్లోకి వెళ్ళిపోయింది. ఆ విషయమే జగన్ కు బాగా డ్యామేజ్ జరిగింది. అయితే తాజాగా ఓ మీడియాలో జేడి చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు అండ్ కో, చంద్రబాబు మీడియా ఏమి సమాధానం చెబుతుందో చూడాలి.