మళ్ళీ విశాఖపట్నం నుంచే పోటీ చేయనున్నట్లు పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు సీబీఐ మాజీ జేడీ, జనసేన మాజీ నేత వీవీ లక్ష్మినారాయణ. అసలు పేరు వీవీ లక్ష్మినారాయణ అయినా, జేడీ లక్ష్మీనారాయణగానే ఆయన సుపరిచితులు. సీబీఐ జేడీగా ఆయన పలు కీలక కేసుల్ని డీల్ చేశారు. అందులో వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు కూడా ఒకటి.
స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసి, 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన లక్ష్మినారాయణ, విశాఖ లోక్‌సభ నియోజకవర్గ ప్రజల్ని ఓ మోస్తరుగా ఆకట్టుకున్నా విజయమైతే సాధించలేకపోయారు. ఆ తర్వాత, జనసేనాని తిరిగి సినిమాల్లోకి వెళ్ళడాన్ని నిరసిస్తూ, జనసేన పార్టీకి దూరమయ్యారు జేడీ.
మళ్ళీ జనసేన వైపు ఆయన దృష్టిసారించినట్లు తెలుస్తోంది. జనసైనికులు, వీర మహిళలు తనను జనసేనలో మళ్ళీ చేరాల్సిందిగా కోరుతున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో లక్ష్మినారాయణ చెప్పారు. అంతే కాదు, జనసేన పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకునేందుకూ ప్రయత్నిస్తున్నారు.
జనసేనాని ఎన్నికల ప్రచారం కోసం తయారు చేయించుకున్న ‘వారాహి’ వాహనానికి సంబంధించిన ఆలివ్ గ్రీన్ రంగు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అది ఏ రంగు.? అన్నది రవాణా శాఖ నిర్ణయిస్తుందనీ, ఈలోగా ఈ విషయమై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం డైవర్షన్ రాజకీయమేనని లక్ష్మినారాయణ అభిప్రాయపడ్డారు. అవగాహనా రాహిత్యంతో కొందరు మాట్లాడుతున్నారంటూ పరోక్షంగా వైసీసీ మీద మండిపడ్డారు వీవీ లక్ష్మినారాయణ.
కాగా, ఇప్పటికే జనసేనానితో వీవీ లక్ష్మినారాయణ భేటీ జరిగిందనీ, త్వరలోనే ఆయన లాంఛనంగా జనసేనలో తిరిగి చేరతారనీ అంటున్నారు. జనసేనలో లక్ష్మినారాయణ చేరికతో ఆ పార్టీకి వచ్చే అదనపు లాభం ఏమైనా వుంటుందా.?