జగన్ ను నమ్ముకునే పార్టీ పెట్టినట్లున్నారు..ఎవరికి దెబ్బ పడుతుందో ?

చూడబోతే అలాగే ఉంది ఈయన వ్యవహారం. మామూలుగా అయితే లక్ష్మీనారాయణ అంటే చాలామందికి తెలీదు. జెడి లక్ష్మీనారాయణ అంటే మాత్రం ఇట్టే గుర్తు పెట్టేస్తారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఈ జెడి లక్ష్మీనారాయణ కొత్త రాజకీయ పార్టీ పెట్టారులేండి. దానిపేరు ‘జనధ్వని’ అట. మరి జనధ్వని అంటే ఏమిటో ఆయనే చెప్పాలి. ఇంతకీ ఎవరైనా పార్టీ పెట్టారంటే ఏదో ఒక సామాజికవర్గాన్ని ఆధారంగా చేసుకునే ఉంటారు. మరి జెడి ఏ వర్గాన్ని టార్గెట్ చేసుకున్నారో అర్ధం కావటం లేదు. ఎందుకంటే, జేడి కూడా కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తే. పైగా రాయలసీమలోని కర్నూలు జిల్లాకు చెందిన వారు. బహుశా జేడి నమ్ముకున్నది జగన్ వ్యతిరేకులందరినీ అనే అనిపిస్తోంది.

 

ఎందుకంటే, జేడి లక్ష్మీనారాయణ అనే అధికారి ఏపిలో ఉన్నారని తెలిసిందే జగన్ పుణ్యమా అని. ఎలాగంటే, కాంగ్రెస్ లోనుండి బయటకు వచ్చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ చాలా కేసులే పెట్టింది. ఆ కేసులను విచారించింది లక్ష్మీనారాయణే. సరే ఆ కేసుల్లో సత్తా ఎంతుంది ? అందులో వీగిపోతున్నవెన్ని ? అని అడక్కూడదు. ఎందుకంటే, ఆ కేసులు పెట్టిందే రాజకీయ వేధింపులతో అని అందరికీ తెలిసిందే. కేసుల విచారణ సమయంలో జేడి లక్ష్మీనారాయణ అంటే చంద్రబాబు జేబులో మనిషే అన్నంతగా ప్రచారం జరిగింది.

 

ఇపుడు విషయం ఏమిటంటే, జేడి ఇపుడు కొత్తగా రాజకీయ పార్టీ పెట్టారు. జేడి పార్టీ పెట్టారంటే కుప్పలు తిప్పలుగా వచ్చి ఓట్లేసేస్తారని అనుకునేందుకు లేదు. జగన్ కేసులను విచారించే సమయంలో మధ్య తరగతి వాళ్ళు, ప్రధానంగా జగన్ వ్యతిరేకులు లక్ష్మీనారాయణను బ్రహ్మాండమనే వారు. మరి ఇపుడు వారంతా జనధ్వనికి ఓట్లేస్తారా ? కాపు వ్యక్తి కాబట్టి కాపులు ఆధరిస్తారా ? ఏమైనా జేడి పార్టీ పెట్టటం వల్ల ఇద్దరికి బాగా నష్టం జరిగే అవకాశం ఉంది. అదేమిటంటే, ఇఫ్పటి వరకూ జనసేన అధినేతకే కాపుల ఓట్లు పడతాయని అనుకుంటున్నారు. కానీ ఇపుడు జేడి కూడా పోటీలోకి వచ్చారు. అదే విధంగా జగన్ వ్యతిరేక ఓట్లంతా తనకే పడతాయని చంద్రబాబు అనుకుంటున్నారు. కానీ జేడి పార్టీ పెట్టి చంద్రబాబుతో కూడా జగన్ వ్యతిరేక ఓట్లను చీల్చుకునే అవకాశం ఉంది. అంటే ఒకపుడు లోక్ సత్తా చేసిన పనే రేపు జనధ్వని చేస్తుందా ?