వైసీపీకి గుడ్ న్యూస్ చెప్పిన జేడీ… మరోసారి ఫ్యానే!

2018లో సీబీఐలో తన పదవికి రాజీనామా చేసిన జేడీ లక్ష్మీనారాయణ… 2019 ఎన్నికల ముందు వరకూ సొంతంగా పార్టీ పెట్టాలని ప్రయత్నం చేశారు. కానీ చివరికి జనసేనలో చేరి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఆయనకు ఆ ఎన్నికల్లో రెండు లక్షల 80 వేల ఓట్ల వచ్చాయి. దీంతో ఆయన వైజాగ్ లో బలమైన అభ్యర్థికిందే లెక్క. అయితే ఈయన్ని కూడా పవన్ కాపాడుకోలేకపోయారు!

అవును… గెలిచిన ఒక్క ఎమ్మెల్యేనీ పవన్ నిలుపుకోలేకపోయారని అంటుంటారు. ఈ సమయంలో జేడీ లక్ష్మీనారాయణ లాంటి వారిని సైతం పవన్ కాపాడుకోలేకపోయారు. మొదటిసారి పోటీ చేసి టీడీపీ – వైసీపీలను కాదని ఆ స్థాయిలో రెండులక్షల ఎనభై వేళ ఓట్లు సాధించడం చిన్న విషయం కాదు. అయితే ఈయన చాలాకాలం క్రితమే జనసేన నుంచి బయటకు వచ్చేశారు.

ఈ క్రమంలో ఆయనకు వైసీపీ నుంచి ఆహ్వానం ఉందని తెలుస్తోంది. జేడీ అంగీకరిస్తే వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థిగా టిక్కెట్ ఇవ్వడానికి పార్టీ అధిష్టాణం రెడీగా ఉందని చెబుతున్నారు. ఇదే సమయంలో టీడీపీ నుంచి కూడా ఆహ్వానం ఉందని తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. అయితే అందుకు జేడీ సిద్ధంగా లేరని అంటున్నారు. ఈ సమయంలో ఆయన తన ఫ్యూచర్ పాలిటిక్స్ పై తాజాగా స్పందించారు.

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏ పార్టీ లో చేరేది లేదని తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఆయన క్రిష్ణా జిల్లా పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన… తాను వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గానే ఎంపీగా పోటీ చేస్తాను అని చెప్పారు. అయితే ఇది ఆయన రాజకీయ ప్రస్థానంలో ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయంగా చెప్పుకోవాలని అంటున్నారు పరిశీలకులు.

అయితే జేడీ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనే నిర్ణయంపై కీలక విశ్లేషణ తెరపైకి వచ్చింది. అవును… జేడీ ఇండిపెండెంట్ గా తలపడితే అది ఆయన గెలుపునకు ఎంతవరకూ ఉపయోగపడుతుందో తెలియదు కానీ వైసీపీకి కచ్చితంగా రాజకీయ లాభాన్ని తెస్తుందని అంటున్నారు. కారణం… జేడీ భారీగా ఓట్లు చీల్చడం ఖాయం. అదే జరిగితే టీడీపీ – జనసేనలకే నష్టం. దీంతో… మరోమారు విశాఖ ఎంపీ సీటు లో ఫ్యాన్ గాలే వీస్తుందని అంటున్నారు.