పొలిటికల్ ఫైర్ బ్రాండ్, వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ఎంపీలంతా ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్నారు. కాగా గురువారం లోక్ సభ వెల్ లోకి వెళ్లి మరీ టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. దీంతో వీరిపై సస్పెన్షన్ వేటు పడింది.
12 మంది టీడీపీ ఎంపీలను సస్పెండ్ చేస్తూ స్పీకర్ సుమిత్ర మహాజన్ ఆదేశాలు జారీ చేశారు. కాగా దీనిపై స్పందించారు అనంతపూర్ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన సస్పెన్షన్ గురించే కాదు, ప్రతిపక్షనేత జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏం మాట్లాడారో పూర్తిగా కింద ఉందిచదవండి.
ప్రజాభిప్రాయం గౌరవించకుండా లోక్ సభలో ఎంపీలను సస్పెండ్ చేయడం ఏంటి అని ప్రశ్నించారు జేసీ. సభ జరిగే వరకు రావద్దని చెప్పడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో సభలకు, కార్యకలాపాలకు అడ్డుపడటం తగదు. కానీ తప్పలేదు. ఎందుకంటే నాలుగున్నరేళ్లుగా అడుగుతున్నా “దున్నపోతు మీద వర్షం పడినట్టు నరేంద్రమోదీ ఏమాత్రం స్పందించడం లేదు.
ఆయన ప్రత్యేకహోదాపై సంతృప్తిపరిచే సమాధానం ఇవ్వడం లేదు. ఎన్నోఏళ్లుగా అసెంబ్లీలో, పార్లమెంటులో ఉన్నవాళ్ళం. అన్నీ తెలిసినా గతిలేక పోడియం దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. సస్పెండ్ చేస్తే అయిపోతుందా? మీ బిల్లులు చేసుకోవడానికి పార్లమెంటు నడుపుతున్నారు తప్ప ప్రజాసమస్యలను పరిష్కారం చేసే విధంగా నరేంద్రమోదీ దృష్టి సారించడం లేదు.
అందుకు వ్యతిరేకంగా విధిలేని పరిస్థితుల్లో పోడియం దగ్గరకి వెళ్లి ఆందోళన చేయాల్సి వచ్చింది. అందుకు సస్పెండ్ చేశారు ఓకే కానీ సభ జరిగినంత కాలం రావద్దని చెప్పడం ఏమిటి? శాశ్వతంగా తొలగించండి” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జేసీ దివాకర్ రెడ్డి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అన్న ఆయన జగన్ ని మిత్రుడిగా చేసుకోవడానికి సిద్ధం అంటూ వ్యాఖ్యానించారు.
ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. దీనిపై రాజకీయ శ్రేణుల్లో వాడి వేడి చర్చ నడుస్తోంది. వైసీపీలో వెళ్లే ఆలోచనలో ఉండి ఇలా అన్నాడా? లేక మరేదైనా కారణం ఉందా? అసలు ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో తెలియక జుట్టు పీక్కుంటున్నారు. జేసీ ఎప్పుడు ఎలా మాట్లాడతారో అంతుబట్టని విషయం. ఏ నోటితో అయితే పొగుడుతారో అదే నోటితో తిడతారు. ఆయన వ్యవహారశైలి ఎప్పుడు ఒక సందేహాన్ని అయితే తొలుస్తూ ఉంటుంది. ఆయన చేసిన వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటో వారి నోటితోనే సెలవిస్తే డౌట్స్ క్లారిఫై అవుతుంది. మరి ఆయన ఎప్పుడు బయటపడతారో చూడాలి.