ఎన్నికల ముంగిట్లో బెదిరింపు రాజకీయాలకు తెరలేచినట్టు కనిపిస్తోంది. కాస్త అంగబలం, అర్ధబలం ఉన్న నాయకులు టికెట్ల బేరాలకు దిగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నందు వల్ల ఆ పార్టీలో పెద్దగా బెదిరింపు శబ్దాలు వినిపించట్లేదు. అధికార తెలుగుదేశం పార్టీ బ్లాక్ మెయిల్ రాజకీయాలను ఇప్పుడిప్పుడే ఎదుర్కొంటోంది. టీడీపీకి గట్టిపట్టు ఉన్న అనంతపురం జిల్లాకు చెందిన జేసీ బ్రదర్స్.. బుధవారం ముక్యమంత్రి చంద్రబాబు నాయుడితో హుటాహుటిన భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తమతో పాటు తమ వారసులకూ టికెట్లు ఇవ్వాలని తెలుగుదేశానికి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టుబట్టారు. ఈ డిమాండ్‌తోనే వారిద్దరూ చంద్రబాబుతో భేటీ అయ్యారు. వారసులకు కూడా టికెట్ ఇస్తామనే హామీతోనే 2014 ఎన్నికల సమయంలో జేసీ బ్రదర్స్ చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకొన్నారు.
తాజాగా ఎన్నికలు తరుముకొస్తున్నందున వారు తమ డిమాండ్‌ను చంద్రబాబు ముందు ఉంచారు. జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి రాజకీయాల్లోకి ప్రవేశించడానికి చాన్నాళ్ల నుంచీ ఎదురు చూస్తున్నారు. 2014 ఎన్నికల సమయానికి రాష్ట్ర విభజన వల్ల ఆలస్యమైంది. కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కోల్పోక ఉండి ఉంటే పవన్ కుమార్ రెడ్డి అప్పటి ఎన్నికల్లో పోటీకి దిగి ఉండేవారే.
కాంగ్రెస్ పార్టీ దారుణంగా పరాజయం పాలు కావడం, తండ్రి దివాకర్ రెడ్డి టీడీపీలోకి చేరడంతో జాప్యం చోటు చేసుకుదంది. ప్రస్తుతం ఆయన `ఇంటింటికి టీడీపీ` కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీ ప్రచార కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్తున్నారు. ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి పరిస్థితి కూడా దాదాపుగా ఇదే. తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో జన్మభూమి వంటి కార్యక్రమాలకు ఆయన హాజరవుతున్నారు. వారిద్దరి రాజకీయ భవిష్యత్తు మాత్రం చంద్రబాబు తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంది.
బతిమాలో, బెదిరించో చంద్రబాబును ఒప్పించే స్థోమత కూడా జేసీ బ్రదర్స్‌కు ఉంది. పవన్‌కుమార్ రెడ్డిని, అస్మిత్ రెడ్డిని ఎక్కడ అకామడేట్ చేస్తారనేది కూడా పాయింట్. అనంతపురం ఎంపీ సీటుతో పాటు తాడిపత్రి, కల్యాణదుర్గం, అనంతపురం అసెంబ్లీ స్థానాల కావాలని జేసీ బ్రదర్స్ పట్టుబడుతున్నారు. అందుకే- అన్నదమ్ములు ఒకేసారి చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబు కుదరదు అంటే.. ప్రత్యామ్నాయ పార్టీని చూసుకుంటారనడంలో సందేహాలు అక్కర్లేదు.