ఆ కార్యక్రమం అలాంటిది… జగన్ కు జైకొట్టిన లోక్‌ సత్తా జేపీ!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో కీలక సంఘటనలు చోటూ చేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు జైల్లో ఉన్నారు.. ఆయన కుమారుడు ఐతే ఢిల్లిలో, లేక పోతే సిట్ ఆఫీసులో ఉంటున్న పరిస్థితి. ఈ సమయంలో వైసీపీ దూకుడు పెంచింది. జనాల్లోకి వెళ్లాలని ఫిక్సయ్యింది. ఈ సమయంలో ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న ఒక నిర్ణయాన్ని లోక్‌ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ ప్రశంసించారు.

అవును… ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ నిర్ణయాన్ని జయప్రకాశ్‌ నారాయణ ప్రశంసించటం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల కార్యాచరణలో భాగంగా నాలుగు కార్యాక్రమాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేలా ప్రకటించారు. అందులో భాగమైన “జగనన్న ఆరోగ్య సురక్ష” కార్యక్రమాన్ని డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ ప్రశంసించారు.

ఏపీలో ముఖ్యమంత్రి జగన్ వైద్య, ఆరోగ్యరంగానికి సంబంధించి కీలక మారుపు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనివిధంగా మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన జగన్… ఇందులో భాగంగా గ్రామస్థాయిలో ప్రతీ పౌరుడి ఆరోగ్యంపైనా శ్రద్ధ పెట్టారు. ఇందులో భాగంగా… ప్రతీ ఇంటికి ఆరోగ్య సిబ్బంది వెళ్లి ప్రతీ ఒక్కరి ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు. వారికి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నారు.

ఇందులో భాగంగా చికిత్స అవసరమైన వారికి ఆరోగ్య శ్రీ ద్వారా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రతీ ఒక్కరి ఆరోగ్య వివరాలు హెల్త్‌ స్క్రీనింగ్‌ రికార్డులను డిజిటలైజ్‌ చేస్తున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. పార్టీలకు అతీతంగా జనం పైకి చెప్పలేకపోయినా.. లోలోపల హ్యాపీ ఫీలవుతున్నారని తెలుస్తుంది.

ఇప్పుడు ఇదే కార్యక్రమాన్ని లోక్‌ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌ లో అమలు చేస్తున్న “జగనన్న ఆరోగ్య సురక్ష” కార్యక్రమం దేశానికే ఆదర్శమని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌ ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబం దగ్గరకు వైద్యులను, ఆరోగ్య కార్యకర్తలను పంపించడం గొప్ప విషయమని జేపీ కొనియాడారు.

ఇలా ఆరోగ్య సురక్ష ద్వారా అందిస్తున్న సేవలను జేపీ ప్రశంసించారు. ఆరోగ్యశ్రీలో పేదలు తమకు నచ్చిన నెట్‌ వర్క్‌ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే సౌలభ్యాన్ని కల్పిస్తుండటాన్ని అభినందించారు. ఆస్పత్రులు కూడా మెరుగైన వైద్యం అందించాల్సిన పరిస్థితి వస్తోందని.. ప్రస్తుతం జీవనశైలి మార్పులతో దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతున్నాయని అభిప్రాయపడిన ఆయన… ఇలాంటి తరుణంలో ముందుగానే వాటిని గుర్తించి సరైన వైద్య సహాయం అందిస్తే ప్రజలకు జరిగే మేలు అంతా ఇంతా కాదని జేపీ వివరించారు.