రాజకీయాల్లో విమర్శలకు ఓ పద్ధతి వుండాలి. కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి అలాంటి ‘మంచి మాటల్ని’ ఆశించలేం. బూతులు, పచ్చిబూతులు తిట్టుకుంటున్నారు రాజకీయ నాయకులు. రాజకీయాల్లో మార్పు తెస్తానంటోన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ మార్పుకి అర్థమేంటో మాత్రం చెప్పలేకపోతున్నారు సరికదా, తానూ ఆ ‘తానులోని గుడ్డ పీలికనే’ అన్నట్టు వ్యవహరిస్తున్నారు.
తాజాగా మాచర్ల వెళ్ళిన జనసేన అధినేత, వైసీపీ నేతల్ని ఉద్దేశించి ‘వైసీపీ గాడిదలు’ అంటూ విమర్శించారు. అట్నుంచి కౌంటర్ ఎటాక్ రాకుండా వుంటుందా.? ‘మేం కాదు, నువ్వే అడ్డగాడిద’ అంటూ మంత్రి అంబటి రాంబాబు స్పందించడం మామూలే. దానికి కౌంటర్ ఎటాక్ ఇస్తూ, ‘ఈ గాడిదతో పోటీకి వచ్చే గాడిద వైసీపీలో ఇంకోటేదైనా వుందా.?’ అంటూ ట్వీటేశారు జనసేన అధికార ప్రతినిథి రాయపాటి అరుణ.
సోషల్ మీడియా వేదికగా వైసీపీ వర్సెస్ జనసేన.. తిట్ల ప్రసహనం కొనసాగుతోంది. కౌలు రైతుల కుటుంబాల్ని ఆదుకునేందుకు జనసేనాని ‘కౌలు రైతు భరోసా’ పేరుతో ఆర్థిక సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మాచర్ల వెళ్ళారు. సుమారు రెండు కోట్ల రూపాయల మేర రైతులకు జనసేనాని సాయం చేశారు.
నిజానికి, ఈ విషయంలో జనసేన అధినేతను అభినందించి తీరాలి. ప్రభుత్వాలు చేయాల్సిన పనిని, వ్యక్తిగా.. రాజకీయ నాయకుడిగా చేస్తున్నారాయన.. అదీ తన స్వార్జితం నుంచి తీసి ఖర్చు చేస్తున్నారు. ఇంత మంచి పని చేస్తూ, ఇందులో ‘గాడిదలు’ అన్న ప్రస్తావన వైసీపీ మీద ఎందుకు తెచ్చినట్లు.?
ఒకవేళ వైసీపీ నేతల్ని ‘గాడిదలు’ అనాలని జనసేనాని అంతలా ఉవ్విళ్ళూరితే, దానికి ఇంకో వేదికను ఎంచుకోవచ్చు. తమలపాకుతో నువ్వొకటిస్తే.. తలుపు చెక్కతో నేనకొటిస్తా.. అన్నట్టు జనసేనాని విమర్శలకు కౌంటర్ ఎటాక్ అంతే స్థాయిలో వస్తోంది.