ఇదేం పొత్తు ధర్మం.? రెండు పార్టీలూ కలిసి కూర్చుని, చర్చించి కదా ఉమ్మడి అభ్యర్థుల్ని ప్రకటించాల్సింది.? కానీ, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన ట్రేడ్ మార్క్ వెన్నుపోటు రాజకీయాలకు తెరలేపడంతో, జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా అలర్ట్ అయ్యారు. టీడీపీకి షాక్ ఇచ్చారు.
2024 ఎన్నికలలో జనసేన పార్టీ నుంచి పోటీ చేసే రెండు నియోజకవర్గాల్ని జనసేనాని పవన్ కళ్యాణ్ గణ తంత్ర దినోత్సవం నేపథ్యంలో ప్రకటించేశారు. ‘చంద్రబాబు మీద ఒత్తిడి వుంది. ఆ ఒత్తిడి నేపథ్యంలో ఆయన అభ్యర్థుల్ని ప్రకటించడం మొదలు పెట్టారు. నా మీద కూడా ఒత్తిడి వుంది. అందుకే, రెండు నియోజకవర్గాల్ని ప్రకటిస్తున్నా..’ అని చెప్పారు జనసేన అధినేత.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీకి ఎడ్జ్ వున్న నియోజకవర్గాల్లో రాజానగరం, రాజోలు.. ముఖ్యమైనవి. 2019 ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గాన్ని జనసేన గెలుచుకుంది. రాజానగరం నియోజకవర్గంలో జనసేన గెలవాల్సి వున్నా, చివరి నిమిషంలో నడిచిన కరెన్సీ పంపకాల రాజకీయం.. జనసేన పార్టీని వెనక్కి నెట్టేసి, పోటీ వైసీపీ – టీడీపీ మధ్యనే అయ్యింది. ఆ నియోజకవర్గాన్ని వైసీపీ గెలుచుకుంది.
ఇదిలా వుంటే, జనసేనాని ప్రకటించిన నియోజకవర్గాల విషయమై నిజానికి, టీడీపీకి ఎలాంటి అభ్యంతరం లేదు. రాజానగరం నియోజకవర్గంలో టీడీపీ పూర్తిగా దెబ్బ తింది. రాజోలులో అసలు టీడీపీ అంత యాక్టివ్‌గా లేదు.
పోటా పోటీ ప్రకటన.. అనే ప్రచారమైతే జరుగుతున్నా, ఇదంతా నాటకీయ పరిణామమే అనిపిస్తోంది. లేదూ, నిజంగానే టీడీపీకి జనసేన సరైన కౌంటర్ ఇచ్చిందన్నదే నిజమైతే.. ఎన్నికల నాటికి పొత్తు నిలబడటం కష్టమే.!