జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 14వ తేదీ నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లో ‘వారాహి’ ద్వారా పాదయాత్ర చేస్తారంటూ ఇప్పటికే జనసేన పార్టీ నుంచి ప్రకటన వచ్చింది. రూట్ మ్యాప్ కూడా ఖరారయ్యింది. అయితే, ఎన్ని రోజులు ఈ యాత్ర సాగుతుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం నుంచి ‘వారాహి’ యాత్రను జనసేనాని ప్రారంభించబోతున్నారు. మార్గమధ్యంలో పలు చోట్ల బహిరంగ సభలూ వుంటాయి. జనసేనాని వెంట లక్షలాది మంది జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు.. ఇదేమీ కొత్త విషయం కాదు.
అయితే, వచ్చిన జనం అంతా ఓట్లేసెయ్యరు.. అని జనసేనానికి కూడా ఓ క్లారిటీ వుంది. ‘నా అభిమానులంతా నాకు ఓటేసినా.. ఆ లెక్కలు వేరేలా వుండేవి..’ అని జనసేనాని 2019 ఎన్నికల తర్వాత పలు సందర్భాల్లో చెప్పిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి.
ఇంతకీ, అన్నవరం నుంచే ఎందుకు.? కాపు ఉద్యమం ఇదే తూర్పుగోదావరి జిల్లాలో మంట రాజేసింది. అప్పట్లో ఓ రైలు కూడా తగలబడింది. కాపు సెంటిమెంట్ ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా చాలా ఎక్కువగా వుంటుంది. ఆ కాపు సామాజిక వర్గమే, జనసేన పార్టీకి శ్రీరామరక్ష ఇప్పుడు.
ఉభయ గోదావరి జిల్లాల్లోని ఇతర పార్టీలకు చెందిన కాపు నేతలే టార్గెట్‌గా ఈ వారాహి యాత్ర జరుగుతోందన్న వాదనలూ లేకపోలేదు. ఆయా నేతలు ఇప్పటికే పునరాలోచనలో పడ్డారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏమో, ఈ యాత్ర పూర్తయ్యేలోపు ఎంతమంది కాపు నాయకులు జనసేన వైపు ఆకర్షితులవుతారో చూడాలిక.