జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రమ దానం చేయనున్నారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాడైపోయిన రోడ్లను బాగు చేసేందుకు పవన్ కళ్యాణ్ నడుం బిగించబోతున్నారు. మొత్తం రోడ్లన్నీ కాదండోయ్. ఓ రెండు రోడ్లు.. ఓ నాలుగు గుంతలు. తూర్పుగోదావరి జిల్లా అలాగే అనంతపురం జిల్లాలో జనసేనాని రోడ్లను బాగు చేసేందుకు శ్రమదానం చేస్తారు. ఇందుకోసం రెండు వ్యూహాత్మక ప్రాంతాల్ని ఎంపిక చేశారు. అందులో ఒకటి ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ. గోదావరి నదిపై వున్న బ్యారేజీ రోడ్డుని బాగు చేసేందుకు జనసేనాని నడుం బిగిస్తారట. అక్టోబర్ 2వ తేదీ ముహూర్తం. గతంలో ఇదే బ్యారేజీ మీద జనసేనాని ఓ షో చేశారు. పెద్ద సంఖ్యలో జనం ఆయన వెంట నడిచారు.
కానీ, పవన్ కళ్యాణ్.. నడవడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. అంత పెద్దమొత్తంలో జనం ఆయన వెంట నడిచిన వైనం అప్పట్లో రాజకీయ వర్గాల్లో పెను సంచలనం. మళ్ళీ అలాంటి పరిస్థితి ఇప్పుడు రాబోతోందా.? అయినా, రోడ్ల మీద గుంతల్ని బాగు చేసే పేరుతో రాజకీయ రచ్చ షురూ చేస్తే, తలెత్తే రాజకీయ పరిణామాలెలా వుంటాయ్.? అన్నట్టు, రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి. ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు వైఎస్ జగన్ కూడా ఇలాంటివి చేశారు. ఇలాంటివాటిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం మామూలే. పవన్ కళ్యాణ్ రోడ్డెక్కితే, ఆ ప్రభంజనం ఎలా వుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోవిడ్ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం, పవన్ పర్యటనకు అనుమతిస్తుందని అనుకోలేం. అనుమతివ్వకపోతే పరిస్థితేంటి.? సినిమా ఫంక్షన్‌కి హాజరై రాజకీయ రచ్చ లేపిన పవన్ కళ్యాణ్, రాజకీయం చేయడానికి రోడ్డెక్కితే పరిస్థితి ఎలా వుంటుంది.? పవన్ చేసిన విమర్శలకు వైసీపీ నుంచి కౌంటర్ వచ్చింది. మరి, వైసీపీ కౌంటర్ ఎటాక్‌పై పవన్ రివర్స్ ఎటాక్ ఎలా వుండబోతోంది.? వేచి చూడాల్సిందే.