జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. పొత్తుల గురించి అర్థం పర్థం లేని ప్రచారాన్ని నమ్మి, తదనుగుణంగా ఎలాంటి అంచనాలకూ రావొద్దన్నది ఆ ప్రెస్ నోట్ సారాంశం. అదొక్కటే కాదు, ఎలాంటి ఆధారాల్లేకుండా అడ్డగోలు విమర్శలు చేయొద్దన్నది కూడా జనసేనాని ప్రెస్ నోట్‌లో పేర్కొన్న మరో ముఖ్యమైన అంశం.
ఇంతకీ, జనసేనాని ఏమనుకుంటున్నారు.? ప్రస్తుతానికైతే ఆయన ‘ఓజీ’ సినిమా షూటింగులో బిజీగా వున్నారు. రాజకీయాల గురించి పార్టీ ముఖ్య నేతలతో అయినా చర్చించే సమయం పవన్ కళ్యాణ్‌కి వుందా.? లేదా.? అన్నది డౌటే.! ఈలోగా జనసైనికులేమో సోషల్ మీడియా వేదికగా అత్యుత్సాహం చూపుతున్నారు.
టీడీపీ వర్సెస్ జనసేన.. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న యాగీ అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలోనే, జనసేనాని తమ పార్టీ శ్రేణులకు తలంటుపోశారా.? టీడీపీతో సానుకూలత దెబ్బతినకూడదన్నదే జనసేనాని ఉద్దేశమా.? అన్న డౌట్లు వస్తున్నాయ్ కూడా.!
ఇదిలా వుంటే, పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆ నిర్మాణ సంస్థలో వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి వాటాలున్నాయని కొందరు జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.
దాంతో, మైత్రీ సంస్థ నుంచి పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి వచ్చి, సదరు ప్రెస్ నోట్ విడుదల చేయడానికి కారణమయ్యిందా.? అన్నదీ తెలియాల్సి వుంది.