సాయం మంచిదేగానీ.! జనసేనానీ ఇది రాజకీయం కానే కాదు.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ‘సాయం’ విషయంలో అందరికంటే ముందుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. రాజకీయాల్లోకి రాక ముందు నుంచీ, పవన్ కళ్యాణ్ ‘సాయం’ చేయడంలో తనదైన ముద్ర వేస్తూ వచ్చారు.

పవన్ కళ్యాణ్ చేసిన సాయాల గురించి చెప్పుకుంటూ పోతే, చాలా చాలా పెద్ద వ్యవహారమది. వందలు, వేలు, లక్షల మంది సాయం పొందారు పవన్ కళ్యాణ్ వల్ల. పవన్ కళ్యాణ్ అనే కాదు, సినీ పరిశ్రమలో చాలామంది ఈ సాయం విషయంలో ముందుంటారు. అందులో పవన్ కళ్యాణ్ ఇంకాస్త ప్రత్యేకం.

రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్ ఆ సాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్‌ని అభినందించాల్సిందే. కానీ, రాజకీయాల్లో సాయం ఒక్కటే సరిపోదు. జనంలో వుండాలి, జనంతో మమేకమవ్వాలి. అయితే, జనానికి సాయం చేయడం కోసం, తాను సినిమాల్లో కొనసాగుతున్నాననీ, ఈ క్రమంలో ప్రజలతో మమేకమవడం అనేది అప్పుడప్పుడూ మాత్రమే కుదురుతుందనీ జనసేనాని వైపు నుంచి ఓ వాదన తెరపైకొస్తోంది. అందులోనూ నిజం లేకపోలేదు.

విశాఖ హార్బర్‌లో అగ్ని ప్రమాదం జరిగి 60కి పైగా బోట్లు దగ్ధమయ్యాయి. ఇది, పవన్ కళ్యాణ్ అభిమాని, జనసైనికుడు, యూ ట్యూబర్ ‘లోకల్ బాయ్’ నాని వల్లనే జరిగిందంటూ వైసీపీ ఓ ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది. ఆ తర్వాత ఆ కేసుతో అతనికి సంబంధం లేదని తేలిందనుకోండి.. అది వేరే సంగతి.

ఇంకోపక్క, జరిగిన ఘటనపై జనసేనాని స్పందించారు. 60కి పైగా బోట్లు దగ్ధమైన దరిమిలా, ఒక్కో బోటు యజమానికీ 50 వేల రూపాయల చొప్పున మొత్తంగా 30 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని స్వయంగా బాధితుల్ని కలిసి, ఓదార్చి అందజేస్తానని జనసేన అధినేత ప్రకటించారు.

ఇక, ఈ విషయమై అత్యంత జుగుప్సాకర రాజకీయం రచ్చ రచ్చ చేసేస్తోంది. ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం ప్రకటించింది. వైసీపీ వర్సెస్ జనసేన.. ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం షురూ అయ్యింది. మత్స్యకారుల్లో.. అందునా విశాఖ మత్స్యకారుల్లో జనసేన పట్ల ఒకింత పాజిటివ్ థింకింగ్ కనిపిస్తోంది. దీన్ని అధికార వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది.

జనసేనను వైసీపీ ట్రోల్ చేస్తోంటే, వైసీపీని జనసేన ట్రోల్ చేస్తోంది. సాయం.. దాని చుట్టూ రాజకీయం.! అదే, జనసేనాని వీలైనంత ఎక్కువ జనంలో వుంటే, ఇప్పడిలా జనసేనాని ట్రోలింగ్‌కి గురయ్యే ఆస్కారం వుండి వుండేది కాదేమో.!