జనసేనాని పవన్ కళ్యాణ్ షాకింగ్ గేమ్ ప్లే.!

అవినీతి కేసులో చంద్రబాబు అరెస్టయ్యారు. అయినా, ఆయనకే మద్దతు.. అంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.! ఇదెక్కడి వాదన.? జనసైనికులు ఆశ్చర్యపోతున్నారు జనసేనాని తీరుతో. జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పీఏసీ సమావేశం అనంతరం ముఖ్య నేతల సమావేశంలో మాట్లాడిన జనసేనాని, వచ్చే ఎన్నికల్లో టీడీపీతోనే కలిసి వెళతామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారాయి. నిజానికి, ఇదొక అడ్వాంటేజ్ జనసేన పార్టీకి. కానీ, జనసేనాని మాత్రం తెలుగుదేశం పార్టీతోనే కలిసి వెళతామంటున్నారు. అంతే కాదు, చంద్రబాబు అరెస్టుకి నిరసనగా టీడీపీ రాష్ట్ర బంద్‌కి పిలుపునివ్వగా, ఆ బంద్‌లో పాల్గొనాలంటూ జనసైనికులకు హుకూం జారీ చేశారు జనసేనాని.

వాస్తవానికి కింది స్థాయిలో జనసేన – టీడీపీ మధ్య ఓట్ల షేరింగ్ సజావుగా జరిగే పరిస్థితుల్లేవు. ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనకు ఓటు వేసేది లేదని టీడీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే స్పష్టం చేసేస్తున్న సంగతి తెలిసిందే. ‘జనసేన పోటీ చేసే చోట్ల నోటాకి వేస్తాం.. లేకపోతే, వైసీపీకి ఓటు వేస్తాం..’ అంటున్నారు కొందరు టీడీపీ కార్యకర్తలు.

కింది స్థాయిలో పరిస్థితులు ఇలా వున్నా, టీడీపీతోనే జనసేన కలిసి పనిచేస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పడమేంటో జనసైనికులకు అర్థం కావడంలేదు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ నుంచి చిన్న విరామం చూసుకుని, ఆంధ్రప్రదేశ్ వచ్చిన జనసేనాని, అలా రావడానికి కారణం పార్టీ మీటింగేనని చెబుతున్నా, చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాల వల్లే ఆయన రాక సాధ్యమయ్యిందన్నది బహిరంగ రహస్యం.

ఇదిలా వుంటే, చంద్రబాబు అరెస్టుతో టీడీపీ – జనసేన మధ్య సీట్ల పంపిణీ సగానికి మారిందనీ, జనసేన మద్దతు తీసుకోక తప్పని పరిస్థితి టీడీపీకి ఇంకాస్త బలంగా వచ్చిందనీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ, దాన్ని తెలుగు తమ్ముళ్ళు ఖండిస్తున్నారు.

ఏమో, జనసేనానిలో ఎలాంటి ఆలోచనలున్నాయోగానీ.. వ్యవస్థల్ని మేనేజ్ చేయలేక చతికిలపడ్డ చంద్రబాబు, జనసేనని దెబ్బ కొట్టే వ్యూహాలు ఇకపై రచించగలరని మాత్రం అనుకోలేం.! సో, తప్పదు.. జనసేనకి టీడీపీ సలాం కొట్టాల్సిందేనేమో.!