జనసేనాని పవన్ కళ్యాణ్.! ఇంకా అదే మౌనం దేనికి.?

త్వరలో.. అతి త్వరలో ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీతోపాటు, లోక్ సభ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఎడా పెడా సర్వేల అంచనాలూ బయటకు వస్తున్నాయి. అధికార వైసీపీ, ఇప్పటికే పలు నియోజకవర్గాలకి అభ్యర్థుల్ని ఖరారు చేసింది. టీడీపీ కూడా అభ్యర్థుల్ని ఖరారు చేసుకుంటూ వెళుతోంది.

మరి, టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్ళబోతున్న జనసేన పార్టీ నుంచి కనీసం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గమైనా ఖరారు కాకపోవడమేంటి.? ఇదే విషయమై జనసేన శ్రేణుల్లో ఒకింత ఆందోళన వ్యక్తమవుతోంది.

అదిగదిగో పవన్ కళ్యాణ్.. ఇదిగిదిగో ఎన్నికల నేపథ్యంలో మళ్ళీ వారాహిపై పర్యటనలు.. అంటూ జనసేన ముఖ్య నేతల్లో ఒకరైన నాదెండ్ల మనోహర్ చెబుతూ వస్తున్నారు. మాటలకీ, చేతలకీ అస్సలు పొంతన వుండటంలేదు.

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు – జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలు దపాలు భేటీ అయ్యారు. సంక్రాంతికే మొదటి లిస్ట్ ఇరు పార్టీల నుంచీ వస్తుందనే ప్రచారమైతే జరిగింది. కానీ, ఇప్పటికీ మొదటి లిస్టుపై స్పస్టత లేదు.

‘మీరైతే అభ్యర్థుల్ని ఖరారు చేసెయ్యండి.. మేం నియోజకవర్గాల్లో మా పని మేం చేసుకుంటాం..’ అంటూ ఆశావహులు, జనసేనానిపై ఒత్తిడి తెస్తున్నారు. ఓ ఐదారుగురు అభ్యర్థుల్ని అయినా జనసేన ప్రకటించి వుంటే, జనసేనలోకి దూకే నేతల సంఖ్య పెరిగేది.

జనసేనలోకి వెళదామనుకున్న నేతలూ మీనమేషాల్లెక్కెడుతున్నారంటే, టిక్కెట్ల విషయమై జనసేనాని ప్రదర్శిస్తున్న అలసత్వమే అందుకు నిదర్శనం. ఈసారి ఎన్నికలు జనసేనకీ ప్రతిష్టాత్మకమే. ఆలస్యం అమృతం విషం.. అన్న విషయం జనసేనాని తెలుసుకోకపోతే ఎలా.?