బీజేపీని జనసేనాని గాలికొదిలేసినట్టేనా.?

ఇది క్లియర్.! బీజేపీ వస్తే వచ్చింది.. ఛస్తే చచ్చింది.. అన్నట్లే వ్యవహరిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ‘మేమింకా జనసేనతోనే పొత్తులో వున్నాం..’ అని చెప్పుకోవడం మినహా, ఏపీ బీజేపీ నేతలకు మరో ఆప్షన్ లేదు. పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళే ఆలోచనల్ని విరమించుకున్నారు.. టీడీపీతోనే కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.

‘వైసీపీని గద్దె దించాలన్న ఆలోచన మీకుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా మీరు ఎదగాలనుకుంటే.. జనసేన, టీడీపీతోపాటు మీరూ కలవండి’ అని కొన్నాళ్ళ క్రితమే బీజేపీ అధినాయకత్వానికి స్పష్టత ఇచ్చేసిన జనసేనాని, బీజేపీ అధినాయకత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకపోవడంతో తన దారి తాను చూసుకున్నారు.

కృష్ణా జిల్లా అవనిగడ్డలో నిర్వహించిన వారాహి విజయ యాత్ర తర్వాత, ఏపీ బీజేపీ నేతలకూ స్పష్టత వచ్చేసింది జనసేన విషయమై. దాంతో, పురంధేశ్వరి నేతృత్వంలోని ఏపీ బీజేపీ నేతల బృందమొకటి, ఢిల్లీకి వెళ్ళి తమ అధిష్టానంతో పొత్తులపై ఓ నిర్ణయానికి వచ్చే ఆలోచన చేస్తోందిట.

ఓ ఐదారు అసెంబ్లీ సీట్లు, ఒకటో రెండో ఎంపీ సీట్లు.. టీడీపీ – జనసేన కూటమి నుంచి ఆశించడం తప్ప, ఇంకో ఆప్షన్ లేదన్నది ఏపీ బీజేపీ నేతల అంచనా. చంద్రబాబు అరెస్టుతో టీడీపీ శ్రేణులు కొంత డీలాపడినా, జనసేనాని టీడీపీకి భుజం కాయడంతో, అనూహ్యంగా జనసేన పార్టీకి పొలిటికల్ మైలేజ్ పెరిగింది.

ఈ క్రమంలో జనసేన – టీడీపీ కూటమిలో, జనసేన పార్టీనే డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా మారుతోంది. దాన్ని చంద్రబాబు ఎలా డీల్ చేస్తారన్నది వేరే చర్చ. టీడీపీని నేరుగా అయితే బీజేపీ సీట్ల విషయమై డిమాండ్ చేయడానికి వుండేది. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. జనసేన పార్టీనే డిసైడింగ్ ఫ్యాక్టర్.

జనసేనాని అయితే బీజేపీని డంప్ చేశారు. బీజేపీ వెంపర్లాడితే, కూటమిలో బీజేపీకి కొన్ని సీట్లను విదిలించే అవకాశమైతే లేకపోలేదు.