చంద్రబాబు విడుదలపై పవన్ కళ్యాణ్ స్పందన.! అత్యంత వ్యూహాత్మకం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సోదరుడు నాగబాబు తనయుడైన వరుణ్ తేజ్ పెళ్ళి వేడుకల్లో బిజీగా వున్నారు. అదీ, వేరే దేశంలో. వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల పెళ్ళి ఇటలీలో ‘డెస్టినేషన్ వెడ్డింగ్’ మోడ్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ తరుణంలోనే, ఇక్కడ.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడుకి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మద్యంతర బెయిల్ వచ్చింది. జనసేన – టీడీపీ మధ్య పొత్తు కుదిరిన దరిమిలా, చంద్రబాబు అరెస్టుని గతంలోనే పవన్ కళ్యాణ్ ఖండించారు. తాజాగా, బెయిల్ రావడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, హర్షం వ్యక్తం చేసేశారు.

ఇంత తొందరగా పవన్ కళ్యాణ్ స్పందించడమెందుకు.? విదేశాల్లో వున్నారు కాబట్టి సరిపోయింది.. లేదంటే, హుటాహుటిన హైద్రాబాద్ నుంచి రాజమండ్రి కేంద్ర కారాగారం వద్ద చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ స్వాగతం పలికేవారే.. అన్న చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది.

వైసీపీ ఈ విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని తీవ్రంగా ట్రోల్ చేస్తోంది. జనసేన కార్యకర్తల్లో చాలామందికి జనసేనాని స్పందన అస్సలు నచ్చట్లేదు. వారి అసహనం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. దానికి వైసీపీ ఆజ్యం పోసే ప్రయత్నం చేస్తోంది.

అయితే, టీడీపీ మద్దతుదారులు మాత్రం, జనసేన స్పందన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్, చంద్రబాబు పట్ల చూపుతున్న ఆరాధనాభావానికి ముగ్దులవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలంటే, టీడీపీ శ్రేణులు పూర్తిగా జనసేనకు సహకరించాలని తోటి టీడీపీ కార్యకర్తలకు సూచిస్తున్నారు.

జరుగుతున్న పరిణామాలు చూస్తోంటే, తనను సొంత పార్టీ కార్యకర్తలు తప్పు పట్టే పరిస్థితి వున్నా, రాజకీయ అవసరాల దృష్ట్యా, చంద్రబాబుకి వీలైనంత ఎక్కువ సాగిలా పడినట్లే వ్యవహరించాలనే కోణంలోనే పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఈ వ్యూహం.. ఫలిస్తుందా.? వేచి చూడాల్సిందే.