ఢిల్లీకి వెళ్ళినారు.! జనసేనాని ఏం సాధించినారు.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొన్నారు. పలువురు బీజేపీ ప్రముఖులు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో ముచ్చటించారు.

వీడియోల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి కమలదళం బాగానే గౌరవం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ వెనకాల నిలబడి కనిపిస్తున్నారు జనసేన అధినేత. చుట్టూ కమలదళం నాయకులు పెద్ద సంఖ్యలో దర్శనమిస్తున్నారు.

2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఎన్డీయే కూటమి సమావేశం జరిగింది. భాగస్వామ్య పక్షాలతో వివిధ అంశాలపై బీజేపీ చర్చించింది. తెలుగు నేల నుంచి కేవలం జనసేన పార్టీనే, బీజేపీకి అధికారిక మిత్రపక్షం గనుక.. జనసేనానికి ప్రత్యేక ఆహ్వానం పంపింది బీజేపీ ఈ ఎన్డీయే సమావేశం కోసం.

అంతా బాగానే వుందిగానీ, తెలుగునాట జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో బీజేపీ పెద్దలు ఏం చర్చించినట్లు.? ఆయనకు రాజకీయంగా ఏం భరోసా ఇచ్చినట్లు.?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ – జనసేన పార్టీల తరఫున ముఖ్యమంత్రి పదవి కోసం ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పేరు ఖరారయ్యిందా లేదా.? సీట్ల పంపకాల చర్చలేమైనా ప్రాథమిక దశలో అయినా జరిగాయా.? లేదా.?

ప్చ్.. దేనికీ ప్రశ్నల్లేవ్. ఆ పొత్తుల చర్చలు.. ఇతరత్రా వ్యవహారాలు వేరే వేదికలపై చర్చించబడ్తాయ్. అది అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతానికైతే ఢిల్లీ వెళ్ళారు.. వచ్చేస్తారు.. అంతే.. అంతకు మించి జనసేనాని ఢిల్లీ టూర్ గురించి మాట్లాడుకునేదేమీ లేనట్టే.!