వ్యూహం మార్చిన జనసేనాని.! వైసీపీ కూడా మారాల్సిందే.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పొత్తుల విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో కలిసి వెళ్ళబోతున్నామన్న సంకేతాల్ని జనసైనికులకు పంపించారు. అదే సమయంలో, వైసీపీ వ్యూహం బెడిసి కొడుతుందన్న వ్యాఖ్యలూ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ఎలా స్పందించాలో వైసీపీకి అర్థం కావడంలేదు.

పవన్ కళ్యాణ్ ఎవర్నీ నేరుగా తిట్టలేదు నిన్నటి జనసేన 10వ ఆవిర్భావ సభలో. కానీ, వైసీపీ నేతలైతే మీడియా ముందుకొస్తున్నారు, జనసేన అధినేత మీద మండిపడుతున్నారు. అలా మండిపడుతున్నవారిలో కాపు సామాజిక వర్గ నేతలే ఎక్కువ. తద్వారా కాపు సామాజిక వర్గంలో వైసీపీ పట్ల వ్యతిరేక పెరగాలన్నది జనసేనాని వ్యూహం.

ఎక్కువగా కుల ప్రస్తావనే వచ్చింది పవన్ కళ్యాణ్ ప్రసంగంలో. అయినాగానీ, ఆ కుల ప్రస్తావన.. ఇతర కులాల్లో జనసేన పట్ల వ్యతిరేకతకు కారణమవలేదు. చివరికి రెడ్డి సామాజిక వర్గం కూడా జనసేన పట్ల సింపతీ చూపేలా జనసేనాని ప్రసంగం సాగింది. రాజకీయ విమర్శల కోణంలో మీడియా కూడా జనసేనకు రాజకీయ ప్రత్యర్థిగా మారిపోవడం అన్నది వేరే చర్చ.

జనసేన అధినేత వ్యాఖ్యల్లో కొంత గందరగోళం, అయోమయం కనిపిస్తున్నా.. సాఫ్ట్‌గా సాగిన ఆయన ప్రసంగం చాలామందిని ఆకట్టుకుంది. ప్రధానంగా పొత్తుల విషయమై జనసేనాని చేసిన వ్యాఖ్యలతో టీడీపీ సైతం డిఫెన్స్‌లో పడిపోయింది. ఖచ్చితంగా తనతోపాటు కొంతమందిని అసెంబ్లీకి తీసుకెళ్ళాలన్న జనసేనాని వ్యూహంపై వైసీపీ ఒకింత ఆందోళన చెందుతోంది.