పవన్ సీరియస్ వార్నింగ్: వారంతా ఉంటున్నారా.. వెళ్తున్నారా?

తెలంగాణ ఎన్నికల ముచ్చట ముగిసింది. రేపే ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఈ సమయంలో తెలంగాణలో బీజేపీ – జనసేన ప్రభావం పెద్దగా ఉండదనే విషయం ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి తెరపైకి వచ్చింది! ఈ సమయంలో ఏపీలో దూకుడు పెంచారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇందులో భాగంగా తాజాగా ఆపార్టీ విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. ఇందులో భాగంగా తెలంగాణ ఎన్నికల ప్రచారానికి రెండు రోజులు మాత్రమే కేటాయించిన ఆయన… ఏపీలో సీరియస్ గా ముందుకు కదులుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో… టీడీపీతో పొత్తు, దాని అవసరం, ఆ పొత్తుపై పెదవి విరుస్తున్న జనసేన కార్యకర్తలు, నాయకులు మొదలైన అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా… “జనసేన – టీడీపీ పొత్తుపై వ్యతిరేకంగా ఏ స్థాయి నాయకులు మాట్లాడినా.. చిన్న కార్యకర్త మాట్లాడినా ఊరుకునేది లేదు. అలాంటి వారిని వైసీపీ కోవర్టులుగా భావిస్తాం. వారిపై గట్టి చర్యలు తీసుకుంటాం. ఈ నిర్ణయం నచ్చనివాళ్లు ఎవరైనా ఉంటే వైసీపీలోకి వెళ్లిపోవచ్చు” అని పవన్ కల్యాణ్ సూటిగా తెలిపారు. అది జనసేన నాయకులైనా.. కార్యకర్తలైనా అన్నమాట!

వాస్తవానికి రాజమండ్రి సెంట్రల్ జైల్ సాక్షిగా టీడీపీతో పొత్తు ప్రకటించిన అనంతరం పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… పిఠాపురం మాజీ ఇంఛార్జి మాకినీడి శేషు కుమారి జనసేనకు రాజీనామా చేసారు. రాజానగరం నియోజకవర్గ ఇన్‌ చార్జిగా పనిచేసిన మేడా గురుదత్త ప్రసాద్‌ సహా 100 మంది ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ ఛార్జ్ కేతంరెడ్డి వినోద్ రెడ్డి.. పార్టీకి గుడ్‌ బై చెప్పారు. ఈ క్రమంలో తాజాగా జనసేన రాష్ట్ర క్రమ‌శిక్షణ క‌మిటీ వైస్ చైర్‌ ప‌ర్సన్ ప‌సుపులేటి ప‌ద్మావ‌తి తాజాగా వైసీపీలో చేరారు. పలువురు కార్యకర్తలు సైతం జనసేనకు బై చెప్పి ఫ్యాన్ కిందకు చేరిపోయారని తెలుస్తుంది. ఈ సమయంలో మరికొంతమంది నేతలకు, అత్యధిక శాతం మంది కార్యకర్తలకు టీడీపీ – జనసేన పొత్తు ఏమాత్రం అంగీకారంగా లేదని అంటున్నారు.

దీంతో జనసేనలో ఏ ఇద్దరు నేతలు, ఏ నలుగురు కార్యకర్తలు కలిసినా టీడీపీతో పొత్తు, ఫలితంగా పార్టీ ఫ్యూచర్ ఫినిష్ అనే చర్చ బలంగా జరుగుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో… పవన్ ఈ స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. తనను నమ్మాలని మరోసారి బలంగా కోరారు. అవివేకంతోనో, అజ్ఞానంతోనో ఈ పొత్తు నిర్ణయం తీసుకోలేదని సూటిగా స్పష్టం చేశారు.

దశాబ్ద కాలంపాటు ఎవరున్నా లేకపోయినా పార్టీని నడిపిన వ్యక్తి.. ఏ నిర్ణయం తీసుకున్నా మనందరికీ మంచి జరిగేలా, రాష్ట్రానికి మేలు చేసేలా, తెలుగు ప్రజలకు అండగా ఉండేలా నిర్ణయం తీసుకుంటాడని సంపూర్ణంగా నమ్మితే తనను సందేహించరని తెలిపిన పవన్… తనను చంద్రబాబు అర్ధం చేసుకుంటున్నారు కానీ, “మనవాళ్ల”కు ఎందుకు అర్థం కావాడంలేదో తనకు అర్ధం కావడం లేదని అన్నారు!

దీంతో… టీడీపీ – జనసేన పొత్తు విషయంలో పవన్ తో పూర్తిగా ఏకీభవించేవారు, అనుమానించని వారు మాత్రమే పార్టీలో ఉండాలని… అనుమానించేవారు, ఈ పొత్తు నిర్ణయం అజ్ఞానంతో తీసుకున్నట్లు భావించేవారు పార్టీని వీడొచ్చని పవ్న స్పష్టం చేసినట్లయ్యింది. మరి ఈ విషయంపై నేతలు, కార్యకర్తలు ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి.