బీజేపీ ఫిక్స్… పవన్ ని వదిలే ప్రసక్తి లేదు!

రాజకీయాల్లో పగవాడికి కూడా రాకూడని కష్టం ఏపీలో బీజేపీకి వచ్చింది. అది కూడా ఒకసారి కాదు పదే పదే వస్తోంది. 2019లో నోటాతో పోటీ పడలేక చేతులెత్తేసిన బీజేపీ.. లోకల్ బాడీ ఎన్నికల్లో బ్యాలెంట్ పోరులోనూ అత్యంత వెనకబడింది. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం చెల్లని ఓట్లతో పోటీ పడలేక నిస్సహాయంగా నిలబడిపోయింది. ఫలితంగా… జాతీయ స్థాయిలో వరుసగా రెండోసారి అధికారానికి వచ్చిన పార్టీకి ఏపీలో ఇదా పరిస్థితి అని ట్రోల్స్ మొదలైపోయాయి. అయితే… ఈ ఫలితాలు రావడం కూడా ఒకందుకు తమ మంచికే అని సర్ధుకుపోతూ, కొత్త ఆలోచనలు చేస్తున్నారంట ఏపీ బీజేపీ నేతలు!

2019 ఎన్నికల్లో బీజేపీకి పడ్డ ఓట్ల కంటే నోటా ఓట్లే ఎక్కువ. ఇపుడు చూస్తే పట్టభద్రుల ఎన్నికల్లో చెల్లని ఓట్ల కంటే కూడా బీజేపీకి తక్కువ ఓట్లు పడ్డాయ్. ఉత్తరాంధ్రా పట్టభద్రుల సీట్లో ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పోటీ చేస్తే ఆయనకు మొత్తం పోలైన రెండు లక్షల ఓట్లలో వచ్చినవి జస్ట్ పదకొండు వేలు. ఇక్కడ చెల్లని ఓట్లు చూస్తే పన్నెండు వేలపై చిలుకు! ఇక తూర్పు రాయలసీమలో బీజేపీకి వచ్చిన ఓట్లు ఆరు వేల కంటే తక్కువే. ఇక్కడ చెల్లని ఓట్లు పదిహేడువేలు! ఈ లెక్కలు సరిపోతాయి… ఏపీలో బీజేపీపై జననాలకు ఎలాంటి అభిప్రాయం ఉందో చెప్పడానికి. తమ ఓటును చెల్లని ఓటుగా అయినా వేసుకుంటాం కానీ.. బీజేపీకి మాత్రం వేయమనేటంత ఆగ్రహం ఏపీ బీజేపీ నేతలపై ఉంది. అంటే… బీజేపీ విషయంలో ఏపీ జనాలు… నేలమీద పోసేది నెత్తిన పొయ్యమన్నా పోయడం లేదన్నమాట!

వాస్తవ పరిస్థితులు ఇలానే ఉంటే.. ఏపీలో చక్రాలు గట్రా తిప్పాలని తెగ కలలు కంటున్నారు బీజేపీ నేతలు. వీళ్ల మాటలు కోటలు దాటతాయి కానీ.. చేతలు మాత్రం గడప కూడా దాటవు! ఈ పరిస్థితుల్లో ఏపీలో బీజేపీ మనుగడ కాపాడుకోవాలంటే… జనసేన తోడు కచ్చితంగా అవసరమని ఫిక్సయ్యారంట ఏపీ బీజేపీ నేతలు. ఇందులో భాగంగా.. ఆరు నూరైనా – నూరు ఆరైనా పవన్ ని బ్రతిమాలో బెదిరించో పొత్తుతోనే సాదారణ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారంట.

అవును… జనసేన సత్తా ఏమిటన్నది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసిన బీజేపీ నేతలు… టీడీపీకొచ్చిన సీట్లు – జనసేన తోడుంటే తమకు వచ్చేవాని ఫీలవుతున్నారంట. పోనీ గెలవకపోయినా… కనీసం నోటాని దాటేవాళ్లమనేది వారి ఆలోచనగా ఉందట. సో… వీలైనత తొందర్లో జనసేనతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి… రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నామని చెప్పించాలని తపన పడుతున్నారంట ఏపీ బీజేపీ నేతలు. మరి వారి కోరిక నెరవేరుతుందా… ఎప్పుడెప్పుడు సైకిల్ ఎక్కేద్దామా అని ఆలోచిస్తున్న పవన్… కమళం చేతబడతారా… లేక, సారీ బీజేపీ అని చెప్పేస్తారా అన్నది వేచి చూడాలి!