వాటే జోక్….జనసేనకు 88 సీట్లట

పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో జనసేన నేత పివి లక్ష్మీనారాయణ పెద్ద జోక్ పేల్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు 88 అసెంబ్లీ సీట్లు, 15 నుండి 20 పార్లమెంటు నియోజకవర్గాల్లో గెలవబోతోందంటూ జోస్యం చెప్పారు. నిజానికి లక్ష్మీనారాయణ చెప్పిన ఫిగర్లు విన్న తర్వాత జనసేన నేతలే నవ్వు ఆపుకోలేకపోతున్నారు.

ఎందుకంటే, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గెలవటమే కష్టమనే ప్రచారం జరుగుతోంది. ఇటువంటి నేపధ్యంలో 88 సీట్లంటే అధికారంలోకి వస్తున్నట్లు లక్ష్మీనారాయణ చెప్పటమే. మళ్ళీ ఆ మాటను మాత్రం నేరుగా చెప్పటం లేదు. 175 సీట్లలో 88 గెలవటమంటే అధికారంలోకి రావటమే అని తెలిసిందే.

ఓడిపోతామన్న భయంతోనే ఇతర పార్టీల నేతలు తమ పార్టీపై విష ప్రచారం చేస్తున్నట్లు పివి మండిపడ్డారు.  ఏదో తన పార్టీ గురించి పివి అతిగా ఊహించుకోవటమే కానీ నిజానికి జనసేనను చాలా నియోజకవర్గాల్లో జనాలే పట్టించుకోవటం లేదు. చాలా నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్ధులు మూడోస్ధానానికి పడిపోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. జనసేన నేతలే వైసిపికి మద్దతుగా నిలబడుతున్నట్లు తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది.

అంతెందుకు అధినేత పవన్ గెలవాలంటే టిడిపి ఓట్లే దిక్కన్నట్లుగా తయారైంది పరిస్ధితి. ఇటు గాజువాకలో కానీ అటు భీమవరంలో కానీ పవన్ సొంతంగా గెలిచే పరిస్ధితి లేదని క్షేత్రస్ధాయి పరిస్ధితులను బట్టి తెలుస్తోంది. అసలు విశాఖపట్నం పార్లమెంటులో పోటీ చేస్తున్న మాజీ జేడి గెలుపే అనుమానమట.  అలాంటిది జనసేన అధికారంలోకి వస్తుందని లక్ష్మీనారాయణ చెబితే జోక్ కాక మరేంటి ?