35 శాతానికి పెరిగిన జనసేన ఓటు బ్యాంకు.!

2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి లభించిన ఓటు బ్యాంకు దాదాపు 7 శాతమట.! అదిప్పుడు ఎంతవరకు పెరిగిందో తెలుసా.? 35 శాతానికి. ఇది జనసేన పార్టీ చెబుతున్న లెక్క. ‘మనం అధికారంలోకి రాబోతున్నాం..’ అంటున్నారు జనసేన పార్టీ ముఖ్య నేత నాగబాబు.

తాజాగా, జనసేన పార్టీ నిర్వహించిన ఓ బహిరంగ సభలో నాగబాబు మాట్లడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమా షూటింగులతో బిజీగా వుండడంతో, తన సోదరుడు నాగబాబుకి పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించిన సంగతి తెలిసిందే.

నాగబాబు, జిల్లాల పర్యటనలు ప్రారంభించారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు, జనసేన పార్టీ ఓటు బ్యాంకు ఏకంగా 35 శాతానికి పెరిగిందని చెబుతున్నారు.

జనసేన పార్టీకి 35 శాతం ఓటు బ్యాంకు వుందని ఆ పార్టీ అధినేత బలంగా నమ్మితే, ప్రతిపక్ష నేత చంద్రబాబు దగ్గరకు వెళ్ళాల్సిన పనిలేదు. నిజానికి, పవన్ కళ్యాణ్ కూడా సినిమాలు పక్కన పెట్టేసి, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి, పార్టీ ఓ బ్యాంకుని ఇంకాస్త పెంచేందుకు ప్రయత్నించేవారే.

‘మేం అధికారంలోకి వస్తాం..’ అనే మాట జనసేన పార్టీ నుంచి చాలా అరుదుగా వినిపిస్తోంది. నిజానికి, 35 శాతం వరకు జనసేన పార్టీకి ఓటు బ్యాంకు వుంటే.. రాష్ట్రంలో త్రిముఖ పోటీ జరుగుతుందనే అర్థం. అదే జరిగితే, జనసేన తేలిగ్గానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. కానీ, ఈ లెక్కల్ని ఎంతవరకు నమ్మగలం.?