ఖర్చుపెట్టగలిగిన అభ్యర్థుల కోసం జనసేనాని వేట.!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు జనసేన పార్టీని డిఫెన్స్‌లో పడేసిన మాట వాస్తవం.! కూకట్‌పల్లి నియోజకవర్గంలో కాస్తంత గట్టిగానే ఖర్చు పెట్టారు జనసేన అభ్యర్థి మమ్మారెడ్డి ప్రేమ్ కుమార్. అందుకే, ఆయన డిపాజిట్ తెచ్చుకోలిగారు.

ఇక, ఇదే ఈక్వేషన్‌ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికీ జనసేన పార్టీ అప్లయ్ చేసుకోవాల్సి వుంటుంది. అదే పనిలో జనసేన అధినేత పవన్ కళ్యాన్ కూడా బిజీగానే వున్నారట. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి, అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి వుంది. అయితే, టీడీపీతో పొత్తు నేపథ్యంలో, ఎన్ని సీట్లలో.. ఎవరెవరు పోటీ చేయాలన్నదానిపై ఓ క్లారిటీ రాలేదింకా.
అభ్యర్థులు మొహమాటం లేకుండా, ఖర్చుకి వెనుకంజ వేయకుండా వుండగలిగితే, అలాంటి అభ్యర్థుల్ని చూపించిన ఎక్కువ సీట్లను డిమాండ్ చేయగలమన్నది జనసేన అధినేత ఆలోచనగా వుంది.

50 నుంచి 100 కోట్లు అయినా ఖర్చు చేయాల్సిందే వచ్చే ఎన్నికల్లో.. ప్రధాన రాజకీయ పార్టీలు గెలవడం కోసం. అదీ, ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన లెక్క ఇది. వంద కోట్లు ఏం ఖర్మ.? అంతకు మించి.. అంటున్నారు ప్రధాన రాజకీయ పార్టీల నుంచి ఆశావహులు.

అధికార వైసీపీకి ఈ విషయంలో ఎటూ అడ్వాంటేజ్ వుంటుంది. టీడీపీ సంగతి సరే సరి. జనసేన పార్టీలోనే కొంత గందరగోళం. పదేళ్ళుగా పార్టీని నమ్ముకున్న నేతలు, తమకు ఖర్చుతో పని లేకుండా టిక్కెట్ వస్తుందన్న నమ్మకంతో వున్నారు. అలాంటివారికి కాకుండా, డబ్బులతో వచ్చే నేతలకు టిక్కెట్లు ఇవ్వాల్సి వస్తే, అదో తలనొప్పి జనసేనానికి.

అందుకే, ఇప్పటి నుంచే పార్టీ ముఖ్య నేతలకు, కింది స్థాయి నేతలకు, కార్యకర్తలకు అర్థమయ్యే భాషలోనే జనసేనాని, వివరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారట.