2024 ఎన్నికల్లో జనసేనకు 40 సీట్లు వస్తాయట.! నిజమేనా.?

Janasena

‘మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం..’ అంటున్నారు జనసేనాని. జనసైనికులదీ ఇదే వాదన. ఇంతకీ, 175 సీట్లలోనూ పోటీ చేస్తున్నారా.? లేదా.? అన్న ప్రశ్న వైసీపీ నుంచే కాదు, టీడీపీ నుంచి కూడా జనసేన వైపు దూసుకొస్తోంది. బీజేపీ – జనసేన కలిసి పోటీ చేస్తాయా.? టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తాయా.? బీజేపీ – టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తాయా.? అన్నదానిపై ఆ మూడు పార్టీల్లో ప్రస్తుతానికి స్పష్టత లేదు.

ఎన్నికలంటే రాజకీయ సమీకరణాలు, పొత్తులు.. ఇలా చాలా వ్యవహారం వుంటుంది. వైసీపీ ఒంటిరిగానే పోటీ చేస్తుంది. ఇది క్లియర్. టీడీపీ మాత్రం జనసేన వైపు వలపు బాణాలు సంధిస్తోంది. బీజేపీ – జనసేన కలిసి వున్నాయి. పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరిస్తే, టీడీపీతోనూ కలుస్తామని బీజేపీ అంటోంది.

సో, ఈ మూడు పార్టీలూ ఇప్పుడు తేల్చుకోవాలన్నమాట. ఆ తర్వాతే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయన్నదానిపై ఓ అంచనాకి రావొచ్చు.. ఎలాంటి రాజకీయ విశ్లేషకులైనా. ఆ పంచాయితీ ఇప్పట్లో తెగదు గనుక, సర్వేలన్నీ టీడీపీ – వైసీపీ మధ్య పోటీ.. అన్న కోణంలోనే జరుగుతున్నాయి.

లోక్ సభ సీట్ల పరంగా వైసీపీకి 16 సీట్లు వస్తాయని తాజా సర్వే చెబుతోంది. అంటే, మళ్ళీ వైసీపీదే అధికారం అన్నమాట. కానీ, వైసీపీకి సీట్లు గణనీయంగా తగ్గిపోతాయ్.. అసెంబ్లీ నియోజకవర్గాల విషయంలో. ఓ పాతిక నుంచి ముప్ఫయ్‌కి పైగానే సీట్లను వైసీపీ కోల్పోవాల్సి వస్తుందట.

టీడీపీ మాత్రం కాస్త పుంజుకునే అవకాశం వుందంటున్నారు. 50 వరకు టీడీపీకి సీట్లు వస్తాయంటున్నారు. మరి, జనసేన పరిస్థితేంటి.? బీజేపీ సంగతేంటి.? జనసేన మళ్ళీ సింగిల్ డిజిట్.. ఈసారి మాత్రం జనసేనాని గెలుస్తారు.. అన్నది ఓ వాదన. కాగా, జనసేన కనీసం 40 సీట్లు గెలుస్తుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.. ఆయా సర్వేల్లో టీడీపీ, వైసీపీతోపాటు జనసేననూ పరిగణనలోకి తీసుకుంటే వెలుగు చూస్తున్న నెంబర్ ఇది.