టీడీపీ కంటే ఎక్కువ సీట్లలో పోటీ చేయనున్న జనసేన.!

టీడీపీ – జనసేన పార్టీల మధ్య పొత్తు దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. అయితే, పొత్లు చర్చలకు ఇంకా చాలా సమయం వుందని జనసేన చెబుతోంది. కానీ, వీలైనంత త్వరగా పొత్తుల సంగతి తేల్చేస్తే.. రంగంలోకి దూకెయ్యాలని తెలుగు తమ్ముళ్ళు ఉత్సాహంగా వున్నారు.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, వచ్చే ఎన్నికల్లో టీడీపీ కంటే జనసేన ఎక్కువ సీట్లలో పోటీ చేయబోతోందిట. ఈ సంఖ్య దాదాపుగా వంద వరకూ వుంటుందన్నది టీడీపీ అనుకూల వర్గాల నుంచి అందుతోన్న సమాచారం.!

అదెలా సాధ్యం.? 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటు బ్యాంకు కంటే జనసేన ఓటు బ్యాంకు చాలా చాలా చాలా తక్కువ. ఆ లెక్కన, గట్టిగా పాతిక సీట్లలో జనసేనకు టీడీపీ అవకాశమిస్తే అదే గొప్ప. కానీ, రాష్ట్రంలో పొలిటికల్ ఈక్వేషన్లు మారాయ్.

తమ పార్టీ నాయకులకు కింది స్థాయిలో వున్న పాపులారిటీ, జనసేన పార్టీ నాయకులకు గ్రామ స్థాయిలో లభిస్తున్న ఆదరణ.. ఈ రెండిటినీ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు భేరీజు వేసుకున్నారట. ఈ క్రమంలో ఆయన విస్తుపోయే వాస్తవాల్ని తెలుసుకున్నారట.

పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే నాయకులు తక్కువైపోయారనే భావనలో చంద్రబాబు వున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే, జనసేనకే మెజార్టీ సీట్లు ఇవ్వడం కరెక్ట్ అన్నది చంద్రబాబు భావనగా కనిపిస్తోంది. పైగా, తాము తగ్గితే, బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందనే ఆలోచన చేస్తున్నారట చంద్రబాబు.