‘అమలాపురం’ జనసేనకేనా.? టీడీపీ చేతులెత్తేసిందా.?

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం లోక్ సభ నియోజకవర్గం చాలా చాలా ప్రత్యేకమైనది.! ఈ లోక్ సభ నియోజకవర్గంలో ఈక్వేషన్స్ ఒకింత వింతగా వుంటాయి. రిజర్వుడు నియోజకవర్గమిది. టీడీపీకి పట్టు వుండేది ఒకప్పుడు. కాంగ్రెస్‌కీ బలమైన నియోజకవర్గం. వైసీపీకి కూడా బాగా పట్టున్న నియోజకవర్గమే అమలాపురం.

అయితే, అనూహ్యంగా ఇక్కడ ఈక్వేషన్ మారింది. కోనసీమ అంబేద్కర్ జిల్లా ప్రకంపనలు సహా అనేక కారణాలతో, అధికార వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఈ నియోజకవర్గంలో కనిపిస్తోంది. టీడీపీ పట్ల కూడా అంత సానుకూలత ఏమీ లేదు.

కాపు సామాజిక వర్గ ప్రముఖులు కొందరు, గత కొంతకాలంగా ఈ నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు.. అదీ జనసేన పార్టీ కోసం. స్థానిక ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించింది కూడా.! ఎవరు జనసేన నుంచి ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి.? అన్న స్పష్టత లేకపోయినా, పవన్ కళ్యాణ్ ఫొటో చూపించి, మేగ్జిమమ్ సానుకూలత సంపాదిస్తున్నారు స్థానిక జనసైనికులు.

గోదావరి వరదలు, కోవిడ్ కష్టకాలం.. ఇలా ఏ విపత్తు వచ్చినా, జనసైనికులే ముందుంటూ, స్థానికంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. అధికార పార్టీ తరఫున వాలంటీర్లు గట్టిగానే కష్టపడుతున్నా, క్రిస్టియన్ ఓటు బ్యాంకు అనే అంశం వున్నా.. చాపకింద నీరులా జనసేన బలపడిన విషయం వైసీపీకి కూడా అర్థమవుతోంది.

ఈ ఈక్వేషన్స్ అన్నటినీ పరిగణనలోకి తీసుకున్న టీడీపీ, అమలాపురం నియోజకవర్గాన్ని జనసేనకే వదిలెయ్యాలని అనుకుంటోందిట. త్వరలో జనసేన అధినేత అమలాపురంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో అక్కడే జనసేన అభ్యర్థిని (లోక్ సభకి) జనసేనాని ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.