త్వరలో, అతి త్వరలో పొత్తులపై ప్రకటన చేస్తామంటున్నారు జనసేన కీలక నేతల్లో ఒకరైన నాదెండ్ల మనోహర్. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత అంతలా ‘మాట చెల్లుబాటు’ అయ్యేది నాదెండ్ల మనోహర్ విషయంలోనేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!
ఎన్నికలకు ఇంకా చాలా సమయం వుంది. అప్పుడే పొత్తలపై ప్రకటన ఏంటి.? అన్న ప్రశ్న తెరపైకొస్తోంది. త్వరలో అన్నారుగానీ.. రేపో మాపో అనలేదు కదా.? అంటూ జనసేన నేతలు కవరింగ్ డైలాగులు చెబుతున్నారు. పొత్తులపై ప్రకటన అంటే, టీడీపీతో సంబంధం గురించి ప్రకటనే కదా.? అన్నది మెజార్టీ అభిప్రాయంగా కనిపిస్తోంది.
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీడీపీతో ఒకింత సఖ్యతగా జనసేన వుంటోందన్నది నిర్వివాదాంశం. రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలపై పంచాయితీ తెగడంలేదు. ‘ఇచ్చే స్థానంలో ఇప్పుడు మేమున్నాం..’ అని జనసేన చెబుతోంది. ‘జనసేన స్థాయి అస్సలు మారలేదు’ అని టీడీపీ చిన్నచూపు చూస్తోంది. అదీ అసలు సమస్య.
ఇంతకీ, ఈ వ్యవహారంలో బీజేపీ ఎక్కడ.? బీజేపీని ఏపీ రాజకీయాలకు సంబంధించినంతవరకు ‘ఆటలో అరటిపండు’ వ్యవహారమే. ఆ పార్టీకి ఏపీలో ఓట్లు లేవు, సీట్లు అసలే లేవు. అందుకే, పేరుకి మాత్రమే బీజేపీతో జనసేన పొత్తు నడుపుతోంది. అంతకు మించి బీజేపీకి, టీడీపీ కంటే ఎక్కువ విలువ ఇవ్వడంలేదు జనసేన.
2024లో సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతాయి. నిజానికి, దానికి ఇంకా చాలా సమయం వుంది. అయితే, ఇప్పుడు తొందరపడకపోతే, రెండు పార్టీలకూ చెందిన కింది స్థాయి నాయకత్వం మధ్య సరైన అవగాహన వుండదన్నది టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన అట. ఏదో ఒకటి తేల్చేయాలంటే ముందంటూ అధినేతలు కలిసి కూర్చుని మాట్లాడుకోవాలి. సంక్రాంతి తర్వాత ఆ ముచ్చటా తీరిపోతుందని సమాచారం.
