తొందరగా తేల్చుకోకపోతే అంతర్యుద్దమే!

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందని సామెత. ప్రస్తుతం ఏపీలో టీడీపీ-జనసేనల పొత్తు ఫలితాలు కూడా ఇలానే ఉండబోతున్నాయా అనే కామెంట్లు తాజాగా తెరపైకి వస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే రెండు పార్టీల మనుగడలూ ప్రశ్నార్థకం అయ్యే ప్రమాధం లేకపోలేదని అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ లు బలంగా నమ్ముతున్నారు! అందులో భాగంగా వచ్చినవారందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలని, గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నారు. అయితే వీరిపొత్తులకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతుంది!

కాసేపు ఆత్మాభిమానం సంగతి పక్కనపెడితే… టీడీపీతో పొత్తు విషయంలో జనసేనలోని ఒక వర్గం ఫుల్ జోష్ గా ఉంది. అధినేత అయినా అసెంబ్లీ గేటు తాకగలడా అని ఆలోచిస్తున్నవారికి.. టీడీపీతో పొత్తు ఫుల్ కాన్ ఫిడెన్స్ ని ఇచ్చింది. ఎలాగైనా ఈసారి కనీసం పదిమంది జనసేన నేతలైనా ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగుపెట్టి.. అధ్యక్షా అంటారనే నమ్మకం కలిగింది. దీంతో… అధినేతల మధ్య ఇంకా సీట్ల గురించి ఫైనల్ రిపోర్ట్ బయటకు రాకముందే… కర్చీఫులు వేసేస్తున్నారు. దీంతో ఆయా స్థానాల్లో జనసేన కార్యకర్తలకు – టీడీపీ కార్యకర్తలకు మధ్య గొడవ స్టార్ట్ అయిపోతుంది.

ఇప్పటికే తెనాలి అసెంబ్లీ సీటు విషయంలో టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి, టీడీపీ కార్యకర్తలకూ షాకిస్తూ… రాబోయే ఎన్నికల్లో తాను తెనాలినుంచి పోటీ చేస్తున్నట్లు నాదెండ్ల మ‌నోహ‌ర్ ప్రకటించేసుకున్నారు. దీంతో గోదావరి జిల్లాలో కూడా జనసేన నేతలు కొంతమంది… తమ కార్యకర్తలతో ఎవరికి వారే తమను ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించేసుకుని ఫ్లెక్సీలు పెట్టించడం, సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేయించుకోవడం చేస్తున్నారంట. దీంతో… ఈ వ్యవహారమేదో చినికి చినికి గాలివానగా మారే ప్రమాధం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఎలాగూ పొత్తు కన్ ఫాం కాబట్టి… జనసేనకు ఎన్ని సీట్లిస్తారో, ఎక్కడెక్కడ ఇస్తారో చంద్రబాబుతో పవన్ కన్ ఫాం చేయించుకోని పక్షంలో… చివరి దశలో ఈ సమస్యే చాలా క్లిష్టంగా మారే ప్రమాధం ఉందని సూచిస్తున్నారు విశ్లేషకులు. ఎన్నికల దగ్గరైన తర్వాత చెబితే… అప్పటికప్పుడు కేడర్ కూల్ అయ్యి, పొత్తు పార్టీతో కలిసి పనిచేయడం కష్టంగా మారుతుంది. ఈ విషయాలను పరిగణలోకి తీసుకోని పక్షంలో… దాని ప్రతిఫలం అటు చంద్రబాబు – ఇటు పవన్ కల్యాణ్ లు ఉమ్మడిగా అనుభవించడం తప్పదని హెచ్చరిస్తున్నారు! నాయకులు కలుసుకున్నంత ఈజీకాదు కేడర్ కలిసి పనిచేయడం అనే విషయం మరీచ్పోకూడదని సూచిస్తున్నారు!