జనసేన – టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.!

జనసేన – టీడీపీ మధ్య పొత్తు వుంటుందా.? వుండదా.? ఈ విషయమై రెండు పార్టీల్లోనూ స్పష్టత లేదు. నిన్న మొన్నటిదాకా ‘ఇధ్దరం కలిసి పోటీ చేయాల్సి రావొచ్చు..’ అంటూ ఇరు పార్టీల్లో చర్చ జరిగింది. కానీ, ఇప్పుడు సీన్ మారింది. టీడీపీ సొంతంగా పోటీ చేస్తామంటోంది. జనసేన పార్టీది కూడా అదే వ్యూహం.

బీజేపీ మాత్రం, జనసేన ఛీ కొడుతున్నా.. ‘జనసేనతో కలిసి వెళతాం..’ అని చెబుతుండడం గమనార్హం.! తప్పదు, బీజేపీకి మరో ఆప్షన్ లేదు. అయితే, జనసేన కూడా వద్దనుకుంటే, వైసీపీతో కలవడానికి బీజేపీకి పెద్దగా అభ్యంతరాలుండవేమో. ఎటూ బీజేపీ అడిగేది రెండు మూడు సీట్లే గనుక, వైసీపీ కాస్త ఆలోచించొచ్చు.

ఇదిలా వుంటే, రాష్ట్రంలో పొలిటికల్ ఈక్వేషన్స్ చాలా వేగంగా మారుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సినిమాలతో బిజీగా వున్నా, క్యాడర్ మాత్రం గ్రౌండ్ లెవల్‌లో యాక్టివ్ అవుతోంది. అభ్యర్థులెవరన్నదానిపై స్పష్టత లేకపోయినాగానీ, జనసైనికులు పార్టీని జనంలోకి బలంగా తీసుకెళ్ళగలుగుతున్నారు.

టీడీపీ సంగతి సరే సరి.! ఓ వైపు నారా లోకేష్, ఇంకో వైపు చంద్రబాబు.. జనంలోనే వుంటున్నారు. టీడీపీ క్యాడర్‌లో ఉత్సాహం కనిపిస్తున్నా, నాయకుల్లోనే పార్టీ మీద నమ్మకం కనిపించడంలేదు. ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి నేతలు వస్తుండడంతో.. గందరగోళం మరింత పెరుగుతోంది.

మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత టీడీపీలో కొంత జోష్ పెరిగినా, తిరిగి అధికారంలోకి వచ్చేంత జోష్ అయితే టీడీపీలో లేదన్నది నిర్వివాదాంశం. విడివిడిగా బలపడదాం, అవసరమైతే కలిసి పోటీ చేద్దాం.. అన్న దిశగా జనసేన – టీడీపీ మధ్య అవగాహన కుదిరిందనే వాదనా లేకపోలేదు. కానీ, ఈలోగా రెండు పార్టీల క్యాడర్ మధ్యా పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో రాజకీయ వైరం పెరిగిపోతోంది.