అభ్యర్థుల వేటలో జనసేన బిజీ బిజీ.!

2024 ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయబోతోందన్నదానిపై స్పష్టత లేదు. జనసైనికులు ఈ విషయమై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. గ్రామ స్థాయిలో జనసైనికులు కష్టపడుతున్నా, నాయకత్వ లేమి అయితే వారిని ఇబ్బంది పెడుతోంది.

వన్ అండ్ ఓన్లీ లీడర్ జనసేనకి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే. ఆయన తరఫున వ్యవహారాలు చక్కబెడుతున్నది నాదెండ్ల మనోహర్. గతంలో జనసేన నుంచి పోటీ చేసి, ఆ తర్వాత రాజకీయాల నుంచి పక్కకు తప్పుకున్న మెగాబ్రదర్ నాగబాబు కూడా మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు.. జనసేన కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు.

ఇక, జనసేన తరఫున అధికార ప్రతినిథులు.. నియోజకవర్గ స్థాయి నేతలు.. ఇటీవలి కాలంలో సందడి చేయడం చూస్తూనే వున్నాం. అయినాగానీ, ఓ యాభై నియోజకవర్గాల్లో అయినా నిఖార్సయిన అభ్యర్థులు జనసేనకు వున్నారా.? అంటే అదీ డౌటే. అభ్యర్థుల కొరత ఇంతలా వున్నప్పుడు, గెలుపోటముల గురించి ఏం మాట్లాడుకోగలం.?

ఈ నేపథ్యంలోనే జనసేన ముఖ్య నేత నాదెండ్లను రంగంలోకి దించిన జనసేనాని, అభ్యర్థుల ఎంపిక వ్యవహారాలపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారట. అధినేత ఆదేశాలతో నాదెండ్ల మనోహర్, అభ్యర్థుల ఎంపిక వ్యవహారాల్ని పర్యవేక్షిస్తున్నారు.

మాజీ మంత్రి, బీజేపీ నేత కన్నా లక్ష్మినారాయణతో నాదెండ్ల భేటీ అవడం, అదే సమయంలో కన్నా లక్ష్మినారాయణతో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భేటీ అవడం.. ఇవన్నీ జనసేనకు సంబంధించి కీలక పరిణామాలేనని చెప్పుకోవచ్చు. సంక్రాంతి తరువాత నుంచీ అభ్యర్థుల ప్రకటన కూడా వుండబోతోందట.