వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టి, వైసీపీ శ్రేణులు నానా ఛండాలం చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ అధినాయకత్వానికి తెలియకుండా ఇలాంటివి జరగవు. జరిగాయంటే, దానర్థమేంటి.? అధినాయకత్వమే డైరెక్షన్స్ అలా ఇచ్చి వుండాలి.!
ఏదిఏమైనా, ఈ వ్యవహారం వైసీపీకి చాలా పెద్ద డ్యామేజ్ అయి కూర్చుంది. వైసీపీకి కౌంటర్ ఎటాక్‌గా జనసేన పార్టీ కూడా ఇలాంటి చర్యలు చేపట్టాల్సిందేనని, జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా నినదించడం చూశాం.
కానీ, జనసేన పార్టీ అత్యంత సంస్కారవంతంగా వ్యవహరించింది ఈ విషయంలో. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బొమ్మని, ప్రెస్ మీట్‌లోకి తీసుకొచ్చారు జనసేన కీలక నేతల్లో ఒకరైన నాదెండ్ల మనోహర్.
ముఖ్యమంత్రి అయ్యాక ప్రెస్ ముందుకు వైఎస్ జగన్ రాలేదనీ, ప్రజా సమస్యలపై తాము ప్రశ్నిస్తోంటే, వాటికి సమాధానాలు ముఖ్యమంత్రి నుంచి రావడంలేదనీ, అందుకే ఇలా ముఖ్యమంత్రి బొమ్మని తాము తీసుకొచ్చామని నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు.
2019 నుంచి ఇప్పటిదాకా ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్, రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలనీ, చర్చకు రావాలనీ జనసేన నేత నాదెండ్ల మనోహర్ సవాల్ విసిరారు.
వైసీపీ బహిరంగ సభలో తమ అధినేత ఫొటో మీద వైసీపీ కార్యకర్తల దాష్టీకాన్ని నాదెండ్ల మనోహర్ తీవ్రంగా ఖండించారు. తన రాజకీయ జీవితంలో ఏనాడూ ఇలాంటి ఘటనలు చూడలేదని చెప్పుకొచ్చారాయన.
కాగా, జనసేన ఇలా ముఖ్యమంత్రి ఫొటోని ప్రెస్ మీట్‌కి తీసుకొచ్చి, కుర్చీలో కూర్చోబెట్టడాన్ని హర్షిస్తున్నారు చాలామంది నెటిజనం. జనసేన శ్రేణులు మాత్రం, ‘ఎలాగూ బొమ్మ తెచ్చారు కదా, నాలుగు తగిలించి వుండాల్సింది’ అంటూ స్పందిస్తున్నారు.
మొత్తమ్మీద, ఈ వ్యవహారంలో వైసీపీ ఇమేజ్ డ్యామేజ్ అయితే, జనసేనకు అది అడ్వాంటేజ్ అయ్యింది.. ఫెయిర్ మార్కులు జనంలో జనసేన కొట్టేసింది ప్రెస్ మీట్‌లో సీఎం బొమ్మ కాన్సెప్ట్‌తో.!