ఎన్నికలు సమీపిస్తున్న వేళ అటు జనసైనికులు, ఇటూ టీడీపీ కార్యకర్తలు ఫుల్ కన్ ఫ్యూజన్ లో కొట్టుమిట్టాడుతున్నారని తెలుస్తుంది. ఏ రకంగా ముందుకు వెళ్తున్నాం అనే విషయంలో పరిపూర్ణమైన అస్పష్టత ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అని అంటున్నారు. ఒకపక్క స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ తో ఆందోళనలో ఉన్న టీడీపీ నేతలకు పవన్ ప్రవర్తన మరింత ఆందోళన కలిగిస్తుందని తెలుస్తుంది.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా 20వ రోజులోకి ప్రవేశించారు. అంతకముందు ములాకత్ లో కలిసిన పవన్… టీడీపీతో పొత్తును అధికారికంగా కన్ ఫాం చేశారు. దీంతో చంద్రబాబు కోసం నిరసనలు తెలుపుతున్న టీడీపీ కార్యకర్తలతో జనసేన నేతలు, కార్యకర్తలు కలిశారు. అయితే ఇది ఒకటి రెండు రోజులు మాత్రమే ఉంది. అనంతరం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు!
మరోపక్క బెయిల్స్ కోసం అటు చంద్రబాబు, ముందస్తు బెయిల్ కోసం నారా లోకేష్ లు ఏపీ హైకోర్టులో పిటిషన్స్ వేసుకుని ఎదురుచూస్తున్నారు. దీంతో… లోకేష్ కూడా లోపలికి వెళ్తే పరిస్థితి ఏమిటి అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నియోజకవర్గాల వారీగా భారీ సభలు ఏర్పాటు చేయాలని, ఆ సభల్లో పవన్ తో ప్రసంగాలు ఏర్పాట్లు చేయాలని టీడీపీ నేతలు భావించారని అంటున్నారు.
ఫలితంగా పార్టీ ప్రచారంతోపాటు, చంద్రబాబు అరెస్ట్ కు నిరసనలు కూడా బలంగా చేపట్టినట్లు జనాల్లోకి ఒక సంకేతాన్ని పంపొచ్చని భావిస్తున్నారు. అయితే టీడీపీ నేతలు ఒకటి తలిస్తే పవన్ కల్యాణ్ మరొకటి తలచారు. వారు ఊహించని రీతిలో అక్టోబర్ 1 నుంచి వారాహి యాత్ర ప్రారంభం కాబోతుందని ప్రకటన విడుదల చేశారు. దీంతో… టీడీపీ నేతలు తలలు పట్టుకున్నారని తెలుస్తుంది.
చంద్రబాబు అరెస్ట్, అనంతర రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్న క్రమంలో తమ నాయకుడు పవన్.. టీడీపీ విషయంలో మౌనంగా వుండడంతో జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా వేచి చూసే ధోరణిలో ఉన్నారని అంటున్నారు. ఫలితంగా టీడీపీ చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడం లేదు. దీంతో… టీడీపీ – జనసేన నాయకుల మధ్య పైకి కనిపించని యుద్ధమేదో జరుగుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
అదేవిధంగా… ఈ సమయంలో పవన్ కల్యాణ్ వారహి యాత్ర చేపడితే చంద్రబాబు అరెస్ట్ ఇష్యూ మొత్తం డైవర్ట్ అయిపోయే ప్రమాధం ఉందని అంటున్నారంట. వారాహి యాత్రల్లో పవన్ కల్యాణ్… ప్రభుత్వాన్ని దుయ్యబడతారు. ఉదయం వైసీపీ నేతలు పవన్ ని వాయించి వదులుతారు. దీంతో… మీడియా దృష్టి చంద్రబాబు అరెస్ట్, టీడీపీ నిరసనలనుంచి మళ్లిపోద్దని వాపోతున్నారంట. మరి ఈ బలవంతపు కాపురం ఎన్నాళ్లు నిలుస్తుందనేది వేచి చూడాలని అంటున్నారు పరిశీలకులు!
ఆ సంగతి అలా ఉంటే… పవన్ ను వారాహియాత్ర విషయంలో బీజేపీ ఒత్తిడి తెస్తుందనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ పరిస్థితి మూడు కేసులు, ఆరు పిటిషన్లతో ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును క్యాష్ చేసుకోవాలని బీజేపీ భావిస్తుందని.. అందులో భాగంగానే పవన్ వారాహియాత్రకు ఆర్డర్స్ వేశారని అంటున్నారు. మరి ఈ ట్రైయాంగిల్ స్టోరీ ఎన్నికలనాటికి ఎలాంటి ముగింపు ఇస్తుందనేది వేచి చూడాలి.