తొంభై శాతం విషయంలో తగ్గొద్దు పవన్!

ఏపీలో ప్రస్తుతానికి టీడీపీ – జనసేనల పొత్తే ఫైనల్ అని వార్తలొస్తున్న నేపథ్యంలో… జనసేన కోరబోయే సీట్ల విషయంలో ఒక చర్చ తెరపైకి వస్తుంది. చంద్రబాబు జనసేనకు కేటాయించే సీట్ల విషయంలో పవన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేస్తున్నారు విశ్లేషకులు. ఇందులో భాగంగా 2019 ఎన్నికల ఫలితాలను కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఫలితంగా… అడగబోయే సీట్లపై మరింత స్పష్టత వస్తుందని అంటున్నారు.

ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తు “ఆల్ మోస్ట్ ఉండదు” అని కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు హస్తిన టూర్ కి వెళ్లి, అమిత్ షా, జేపీ నడ్డా లతో భేటీ అయిన సందర్భంలో “పొత్తు” వార్తలు తెగ హల్ చల్ చేశాయి. ఈ విషయంలో టీడీపీ అనుకూల మీడియా అయితే ఒక అడుగు ముందుకేసి… ఏపీలో మీకు మద్దతు ఇస్తాము, తెలంగాణలో మీరు మాకు మద్దతు ఇవ్వండి అని అమిత్ షా చంద్రబాబుని కోరినట్లు రాసుకొచ్చారు! అయితే ఈ విషయంలో స్పందించిన తెలంగాణ బీజేపీ నేతలు… “అలాంటి ఆలోచనలు ఏమీ లేవు – మాకు అవసరం కూడా లేదు” అని సూటిగా సుత్తిలేకుండా చెప్పేశారు.

దీంతో… ఏపీలో కూడా ఇలాంటి రిజల్టే రావొచ్చని కథనాలొస్తున్నాయి. దీంతో… జనసేన కోరే సీట్లపై ఆసక్తి నెలకొంది. ఈ నెల 14వ తేదీ నుంచి పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం అవుతుంది. అంటే ఆల్ మోస్ట్ నాటి నుంచి పవన్ ఫుల్ టైం పొలిటీషియన్ గా మారిపోయే ఛాన్స్ ఉంది. ఆయన పొత్తుల విషయంలో ఎన్ని సీట్లు, ఏయే సీట్లు అడగాలనే దానిపై ఇప్పుడే కసరత్తు పూర్తి చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సందర్భంగా పవన్ పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలపై విశ్లేషకులు చేస్తున్న సూచనలు ఇలా ఉన్నాయి!

2019 ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు పెట్టుకున్న జనసేన… రాష్ట్రవ్యాప్తంగా 138 సీట్లలో పోటీచేయగా కేవలం 16 సీట్లలో మాత్రమే వారికి డిపాజిట్లు లభించిన పరిస్థితి. ఆ 16 సీట్లలో రెండు పవన్ కల్యాణ్ వి కాగా, ఒకటి గెలిచిన రాజోలు నియోజకవర్గంది. ఇక మిగిలిన 13 నియోజకవర్గాల్లో ఒక్కటి మాత్రం గుంటూరు జిల్లాది కాగా… మిగిలిన 12 ఉభయగోదావరి జిల్లాలవే కావడం గమనార్హం.

అంటే… పవన్ కల్యాణ్ చెబుతున్నట్లు జనసేనకు కొద్దో గొప్పో బలం ఉభయగోదావరి జిల్లాలోనే ఉందన్నమాట. ఈ విషయాన్ని పొత్తుల టాపిక్ వచ్చినప్పుడు పవన్ విస్మరించకూడదు. పొత్తులో భాగంగా జనసేనకు చంద్రబాబు ఇచ్చే స్థానాల్లో 90% సీట్లు ఈ రెండు జిల్లాల్లోనూ ఉండేలా జాగ్రత్త పడటం అత్యంత కీలకం. అలా కాకుండా కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, రాయలసీమ అని గొంతమ్మ కోరికలు కోరుకుంటే మాత్రం… ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం లేకపోలేదు.

మరి విశ్లేషకులు చెబుతున్న ఈ సూచనలు పవన్ వింటారా… లేక, బాబు సూచించిన స్థానాలను బ్లైండ్ గా తీసేసుకుని రిస్క్ చేస్తారా అనేది వేచి చూడాలి!