పొత్తులో కొత్త ముసలం… సీనియర్లను టెన్షన్ పెడుతున్న పవన్!

రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేనల మధ్య పొత్తు ఉంటుందా? అంటే కరెక్ట్ గా చెప్పలేని పరిస్థితి నెలకొందని కొందరంటున్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో పొత్తు అనివార్యం అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో… పవన్ తాజాగా ప్రకటిస్తున్న నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ల వ్యవహారం టీడీపీలో సీనియర్లకు టెన్షన్ పుట్టిస్తోందని అంటున్నారని సమాచారం.

అవును… పొత్తు అనివార్యం అయిన వేళ రాష్ట్రవ్యాప్తంగా, మరి ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేయబోతుందనేది ఆసక్తిగా మారింది. అయితే వారాహి యాత్రలో ఇన్ ఛార్జ్ లను ప్రకటించి.. కేడర్ లో కొత్త ఉత్సాహం నెలకొల్పాల్సిన పవన్… నాడు ఒంటరిగా వాహన యాత్ర చేసి.. తాజాగా ఆఫీసుకుని పిలిపించుకుని కాగితాలు చేతిలో పెట్టారని తెలుస్తుంది.

ఆ విషయంలో కొంతమంది జనసనికులు నిరాసగా ఉండగా… మరికొంతమంది ఏదో ఒకటిలే… నియోజకవర్గానికి ఇన్ ఛార్జ్ అయితే వచ్చాడు అని సంబరపడిపోతున్నారంట. ఆ సంగతి అలా ఉంటే… ఆయా నియోజకవర్గాల్లో తమ పార్టీకి సంబంధించిన సీనియర్లు ఉండగా… జనసేన తన ఇన్ ఛార్జ్ లను సెలక్టివ్ గా ప్రకటించడంపై గుర్రుగా ఉన్నారంట టీడీపీ నేతలు.

పైగా… ఈ నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ లుగా ఎంపికైనవారే రాబోయే ఎన్నికల్లో జనసేన నుంచి పోటీకి దిగుతారని స్థానిక జనసైనికులు ప్రచారం చేసుకుంటున్నారని తెలుస్తుంది. దీంతో… అప్పుడే జనసేన – టీడీపీ క్యాడర్ మధ్య మనస్పర్ధలు మొదలైపోయాయని అంటున్నారని సమాచారం.

ఇందులో భాగంగా… తాజాగా ముగ్గురు నేతలను ఇన్ ఛార్జులుగా ప్రకటించారు పవన్ కల్యాణ్. వాటిలో పిఠాపురం, రాజానగరం, కొవ్వూరు ఉన్నాయి. అయితే ఈ మూడు నియోజకవర్గాల్లోనూ కనీసం మూడు సార్లు ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి గెలిచిన సీనియర్ నేతలు ఉండటం గమనార్హం.

అవును… పిఠాపురం విషయనికొస్తే… అక్కడ స్థానిక టీడీపీ నేత ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ ఉన్నారు. 2009, 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేశారు. 2014లో ఇండిపెండెంట్ గా పోటీచేసి గెలిచారు. 2024లో కూడా తనకే టిక్కెట్ అని వర్మతో పాటు టీడీపీ కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారంట. అయితే… ఇక్కడ పవన్ కొత్త ఇన్ ఛార్జ్ ని ప్రకటించారు.

ఇక రాజానగరం నియోజకవర్గం విషయానికొస్తే… 2009, 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసిన సీనియర్ నేత పెందుర్తి వెంకటేష్ ఉన్నారు. ఈయన వరుసగా 2009, 2014లో గెలవగా… 2019లో ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయారు! అయితే 2024లో కూడా తిరిగి తనకే ఛాన్స్ అని ఆయనతో పాటూ టీడీపీ కేడర్ కూడా బలంగా నమ్ముతుందని అంటున్నారు. ఇక్కడ కూడా పవన్ జనసేన ఇన్ ఛార్జ్ ని ప్రకటించారు.

ఇదే సమయంలో రిజర్వుడు సీటు కొవ్వూరు విషయానికొస్తే… ఇక్కడ కూడా జనసేన తన అభ్యర్థిని ఇన్ ఛార్జ్ గా ప్రకటించారు. ఈయన 2009లో టీడీపీ నుంచి గెలిచిన మాజీ ఎమ్మెల్యే కావడం గమనార్హం. దీంతో ఈసారి ఆ అభ్యర్థికే జనసేన టిక్కెట్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ టీడీపీ నుంచి 2014లో కేఎస్ జవహార్ ఎమ్మెల్యేగా పోటీ చేసి 12వేళ ఓట్ల మెజారిటీతో గెలిచారు.

అయితే 2019 ఎన్నికల్లో ఈ స్థానాన్ని వెంగలపూడి అనితకు కేటాయించారు చంద్రబాబు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తానేటి వనిత చేతిలో 25వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఈ సారి మళ్లీ జవహార్ కి ఛాన్స్ ఇవ్వొచ్చని అంటున్నారు. ఈ సమయంలో మరో మాజీ టీడీపీ నేతను జనసేన ఇంఛార్జ్ గా పవన్ ప్రకటించడంతో స్థానికంగా… టీడీపీ – జనసేనల పొత్తు వ్యవహారంపై రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయని అంటున్నారు.

ఏది ఏమైనా… ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో.. పొత్తులు అనివార్యం అనే బాబు భావిస్తున్నారంటూ కథనాలు వస్తోన్న తరుణంలో పవన్ ఇలాంటి నిర్ణయాలు ప్రకటించడం స్థానికంగా టీడీపీ వర్సెస్ జనసేన గా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయని. దీంతో… ఒకవేళ ఎన్నికలు సమీపించిన సమయంలో టీడీపీ-జనసేన పొత్తు అనివార్యమైతే మాత్రం… ఈ ఇంటిపోరులు ఈ రెండు పార్టీలకూ పెను సవాళ్లనే విసిరినా ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు.