ఎమ్మెల్యే రాపాక నోటి తుత్తర ఫలితం ఇది!

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోన‌సీమ జిల్లా, రాజోలు నియోజకవర్గ (జనసేన / వైసీపీ) ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్రసాద్ నోటి తుత్తర కొత్త సమస్యని తీసుకొచ్చింది. జనంలో ఉన్నాం.. జనం వింటున్నారు.. జర్నలిస్టులు గమనిస్తున్నారు అనేసృహ లేకుండా చేసిన వ్యాఖలకు నేడు ఫలితం అనుభవించబోతున్నారు రాపాక వరప్రసాద్.

అవును… బాధ్యతాయుతమైన ప‌దవిలో ఉన్నామ‌న్న క‌నీస సృహ లేకుండా.. నోటికి ఏది వ‌స్తే అది మాట్లాడి కోరి ఇబ్బందులు తెచ్చుకున్నారు రాపాక వరప్రసాద్. దొంగ ఓట్లపై నోరు జారినందుకు ఎన్నిక‌ల సంఘం ఆదేశాల మేర‌కు రాపాక విచార‌ణ ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. ఫలితంగా… బ‌హిరంగంగా ఎలాంటి విష‌యాలు మాట్లాడాలి, మరెలాంటి విషయాలు మాట్లాడకూడదు అనే విషయంలో రాపాక‌కు ఇప్పుడు అనుభ‌వంలోకి వ‌చ్చి ఉంటుందనే కామెంట్లు మొదలైపోయాయి.

ఈ ఏడాది మార్చి 24న అంత‌ర్వేదిలో వైసీపీ ఆత్మీయ స‌మ్మేళ‌నంలో మైకందుకున్న రాపాక.. తాను దొంగ ఓట్లు వేయించుకుని గెలిచినట్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “పూర్వం నుంచి మా గ్రామం చింత‌ల‌మోరికి దొంగ ఓట్లు వేయ‌డానికే కొంద‌రు వ‌చ్చేవారు. ఒక్కొక్కరూ ఐదు, ప‌ది ఓట్లు వేసేవాళ్లు. ఆ ఓట్లు నా గెలుపులో కీల‌క పాత్ర పోషించేవి” అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు రాజ‌కీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఫలితంగా ఆన్ లైన్ వేదికగా నెటిజన్లు రాపాకను ఒక ఆటాడుకున్నారు.

దీంతో… రాపాక వ్యాఖ్యలపై గ‌త నెల 24న రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు అందింది. దీంతో తాజాగా ఈ విషయంపై విచార‌ణ‌కు రాష్ట్ర ఎన్నిక‌ల ప్రధానాధికారి ముకేష్‌ కుమార్ మీనా.. కోనసీమ జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. రాపాక ఎన్నిక‌పై వారంలోపు విచారించి కలెక్టర్ హిమాన్షు శుక్లా.. ఎన్నికల సంఘానికి నివేదిక స‌మ‌ర్పించాల్సి వుంది. మరి ఈ విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయా.. వస్తే రాపాక పొలిటికల్ కెరీర్ కు అవి ఎలాంటి సమస్యలు తెచ్చి పెడతాయి అనేది వేచి చూడాలి!