ఆంధ్ర ప్రదేశ్: “25 సంవత్సారాల భవిష్యత్ ” అనే సిద్ధాంతం మీద 2019 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పోటీ చేయగా దారుణంగా ఓడిపోయింది . పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల కూడా ఓడిపోవటం జరిగింది. జనసేన నుండి ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రాజోలు నియోజక వర్గం నుండి గెలుపొందారు. మొదట్లో రాపాక ప్రాణం ఉన్నంత వరకు జనసేనలో ఉంటాను, పవన్ తోనే ఉంటాను అని గొప్పగా డైలాగులు చెప్పారు. కానీ ఆయనలోని అసలు రాజకీయం బయటపడటానికి ఎంతో సమయం పట్టలేదు. ఆయన సందర్భం వచ్చినప్పుడల్లా వైసీపీకి పరోక్షంగా మద్దతు పలుకుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ పై పొగడ్తలు గుప్పిస్తున్నారు. ఎన్నికల ముందు వైసీపీ నుంచి జనసేనకు జంప్ అయిన రాపాక వరప్రసాద్….రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకే ఓటేశానని బహిరంగంగా ప్రకటించే స్థాయికి వెళ్లారు. తనకున్న ఏకైక ఎమ్మెల్యే రాపాకపై వేటు వేస్తే ఉన్న ఒక్క ఎమ్యెల్యే కూడా పోతారన్న భయంతో పవన్ సైలెంట్ అయ్యారు. అయితే డైరెక్ట్ గా వైసీపీలో చేరే అవకాశం లేకపోవడంతో రాపాక పరోక్షంగా మద్దతు తెలుపుతూ అనధికారికంగా వైసీపీ ఎమ్మెల్యే అనిపించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా రాపాక వరప్రసాద్ కుమారుడు రాపాక వెంకట్ రామ్ వైసీపీలో చేరారు. వెంకటరామ్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తన తండ్రి రాపాక వరప్రసాద్ జగన్ ల సమక్షంలోనే వెంకట్ రామ్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే వల్లభనేని వంశీ మద్దాలి గిరిలతో పాటు పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు…వైసీపీకి మద్దతు పలికిన సంగతి తెలిసిందే. అయితే తమ పదవికి రాజీనామా చేసి వస్తేనే వైసీపీలో చేర్చుకుంటానని జగన్ చెప్పడంతో వీరంతా పరోక్షంగా ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో రాపాక…తాను వైసీపీ కండువా కప్పుకోకుండా తన కుమారుడిని వైసీపీలో స్వయంగా చేర్పించారు. ఈ రకంగా వైసీపీకి తన మద్దతు ఉందని మరోసారి బాహాటంగానే రాపాక చెప్పారు. మరి ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.