జనసేన ఎంఎల్ఏ అరెస్టు

పోలిసు స్టేషన్ పై దాడి చేసిన కేసులో రాజోలు జనసేన ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ ను పోలీసులు అరెస్టు చేశారు. జనసేన తరపున మొన్నటి ఎన్నికల్లో గెలిచింది ఒక్క ఎంఎల్ఏనే అయినప్పటికీ నియోజకవర్గంలో చాలా రచ్చ చేస్తున్నారు. మామూలుగా అధికార పార్టీ ఎంఎల్ఏలు, నేతలు రచ్చ చేయటం చూస్తుంటాం. కానీ ప్రతిపక్ష ఎంఎల్ఏ కూడా ఓవర్ యాక్షన్ చేస్తుండటమే విచిత్రంగా ఉంది.

రాజోలులోని ఓ గెస్ట్ హౌస్ లో పేకాట ఆడుతున్న కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వాళ్ళంతా ఎంఎల్ఏ మనుషులట. కాబట్టి రాపాక వెంటనే రంగంలోకి దిగేశారు. తన మనుషులను అరెస్టు చేసేందుకు లేదని, స్వాధీనం చేసుకున్న మోటారు బైకులు, డబ్బు మొత్తం వెనక్కు ఇచ్చేయాలంటూ గోల మొదలుపెట్టారు.

అరెస్టు చేసిన వాళ్ళని వదిలిపెట్టేందుకు లేదని, స్వాధీనం చేసుకున్న మోటారు బైకులు, క్యాష్ కూడా వెనక్కు ఇచ్చేది లేదన్నారు. దాంతో తన వాళ్ళను విడుదల చేయాలంటూ ఎంఎల్ఏ బాగా ఒత్తిడి పెట్టారు. అయితే అందరినీ పోలీసు స్టేషన్ కు తీసుకెళ్ళి అక్కడే స్టేషన్ బెయిల్ ఇస్తామని చెప్పి పోలీసులు అందరినీ తీసుకెళ్ళిపోయారు.

పోలీసు చర్యలతో మండిపోయిన రాపాక తన మద్దతుదారులతో మలికిపురం పోలీసుస్టేషన్ పై దాడి చేశారు. దాంతో ఎంఎల్ఏలతో పాటు దాడి చేసిన మద్దతుదారులపైన కూడా పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. తర్వాత అరెస్టులు కూడా చేశారు. ఎంఎల్ఏలను పోలీసులు అరెస్టు చేయటంతో రాజోలులో ఉద్రిక్త మొదలైంది. విచిత్రమేమిటంటే రాపాక అరెస్టు అక్రమమంటూ పవన్ కల్యాణ్ తో పాటు నారా లోకేష్ కూడా మండిపోతున్నారు.  ఎంఎల్ఏ అరెస్టు చివరకు ఎక్కడికి దారి తీస్తుందో చూడాల్సిందే.